ఏపీలో బీఆర్ఎస్ జెండా పీకేశారు..!
ఈ క్రమంలోనే తెలంగాణకే ఈ దఫా పార్లమెంటు ఎన్నికల్లో పరిమితం కావాలని నిర్ణయించుకుంది.
By: Tupaki Desk | 29 Jan 2024 3:00 AM GMTఏపీలోనూ పుంజుకుంటామని.. ఇక్కడ కూడా పోటీచేస్తామని గత ఆరు మాసాల కిందట ప్రకటించిన అప్ప టి తెలంగాణ అధికార పార్టీ.. ప్రస్తుత ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి.. తన పరిధిని కుదించుకున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ హవా తగ్గకపోగా.. మరింత పెరగడం.. అయోధ్య రామమందిర ఎఫెక్ట్ పుంజుకోవడంతో బీజేపీని ఎదిరించి నిలబడే పరిస్థితి తక్కువగానే ఉంటుందని అంచనా వేసిన బీఆర్ ఎస్.. ఉన్నది కాపాడుకునేందుకు.. ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే తెలంగాణకే ఈ దఫా పార్లమెంటు ఎన్నికల్లో పరిమితం కావాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తాజాగా మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్పష్టం చేసేశారు. దీంతో ఏపీపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఏపీలో బీఆర్ ఎస్ పార్టీ పుంజుకుంటుందని బావించిన చాలా మంది నాయకులు.. ఇతర పార్టీలను వదిలి పెట్టి.. వెంటనే.. బీఆర్ ఎస్ కండువా కప్పుకొన్నారు. ఏకంగా జనసేన నుంచి బయటకు వచ్చిన తోట చంద్రశేఖర్ వంటివారికి బీఆర్ ఎస్ అధినేత ఏపీ పగ్గాలు అప్పగించారు.
కొన్నాళ్లు తోట బాగానే పనిచేశారు. కాపు సామాజిక వర్గాన్ని.. ఏకం చేసేందుకు బీఆర్ ఎస్ పుంజుకునేలా చేసేందుకు ఆయన ప్రయత్నించారు. పలువురిని పార్టీలోకి కూడా తీసుకున్నారు. ఎన్నికలకు రంగం కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇంతలోనే పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ వద్దని నిర్ణయించడంతో తోట బయట పడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈయన తిరిగి జనసేన వైపు చూస్తున్నారని తెలిసింది. అదేవి ధంగా బీఆర్ ఎస్లో చేరిన నాయకులు కూడా.. తమ తమ దారులు వెతుక్కుంటున్నారు.
కీలక నాయకులు అందరూ రేపో మాపో సమావేశం ఏర్పాటు చేసి.. మూకుమ్మడిగా బీఆర్ ఎస్‌కు రాజీనామాలు చేయడం.. తర్వాత వారి వారి సొంత అజెండా ప్రకారం ముందుకు సాగడం ఖాయమని తెలిసింది. ఇదే జరిగితే ఏపీలో బీఆర్ ఎస్ పార్టీ జెండా పీకేయడం ఖాయమని తెలుస్తోంది. ఇక, గుంటూరు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయానికి ఇప్పటికే ఆరు మాసాలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో ఆ ఇంటి యజమాని కొన్నాళ్ల కిందటే తాళం వేయడం గమనార్హం. ఇదీ.. సంగతి!!