Begin typing your search above and press return to search.

మైనారిటీల సాయంలో షాక్ తప్పదా ?

లక్ష రూపాయల ఆర్ధికసాయంలో మైనారిటీలకు కేసీయార్ ప్రభుత్వం షాకిచ్చేట్లుగానే ఉంది

By:  Tupaki Desk   |   31 July 2023 3:30 PM GMT
మైనారిటీల సాయంలో షాక్ తప్పదా ?
X

లక్ష రూపాయల ఆర్ధికసాయంలో మైనారిటీలకు కేసీయార్ ప్రభుత్వం షాకిచ్చేట్లుగానే ఉంది. ఎందుకంటే మైనారిటీల్లో అర్హులందరికీ తలా లక్ష రూపాయల సాయం చేస్తామని కేసీయార్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. ఇందుకోసం సాయం అవసరమైన వారందరు దరఖాస్తులు చేసుకోవాలని కూడా చెప్పింది ప్రభుత్వం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి సాయం అందుతుందని ప్రకటన కూడా చేసింది. అయితే తాజా సమాచారం ఏమిటంటే దరఖాస్తులు చేసుకున్న వాళ్ళందరికీ సాయం చేయటానికి తగినన్ని నిధులు లేవట.

ఆర్థిక వనరుల కొరత కారణంగా దరఖాస్తులు బాగా పరిమితం చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. మైనారిటీలంటే ముస్లింలు, క్రిస్టియన్ తో పాటు జైన్లు, పార్శీలు, బౌద్దులు వస్తారు. అయితే ముస్లింలు, క్రిస్తియన్లే ఎక్కువమందుంటారనటంలో సందేహం లేదు. అయితే ఇపుడు సమస్య ఏమి వచ్చిందంటే నిధుల కొరత కారణంగా ఈ ఏడాది చాలా పరిమిత సంఖ్యలో సాయం అందించే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సాయం కోసం ప్రభుత్వం కేటాయించింది సుమారు రూ. 300 కోట్లు మాత్రమేనట.

ఇందులో కూడా రు. 30 కోట్లు క్రిస్తియన్లకు, మిగిలింది ముస్లింలకట. ఇప్పటికే మైనారిటీ కార్పొరేషన్ నుంచి సాయం అందుకునేందుకు ముస్లిం వర్గాల నుండి సుమారు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చున్నాయి. ఇవి కాకుండా క్రిస్తియన్ల నుండి దరఖాస్తులు వస్తున్నాయి. ఆగష్టు 14వ తేదీ దాటితే కానీ మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేది తెలీదు. ఈ ఏడాది పరిమిత సంఖ్యలో లక్ష రూపాయల రుణ సాయాన్ని అందించాలని, వచ్చే ఏడాదిలో పూర్తి స్ధాయిలో రుణాలను అందించేట్లుగా కేసీయార్ ఆదేశాలిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదంతా చూస్తుంటే గతంలో హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీయార్ దళిత బందు పథకాన్ని ప్రకటించిన విషయం గుర్తుకొస్తోంది. దళితుల ఓట్ల కోసం అప్పట్లో కేసీయార్ దళిత బంధును ప్రకటించారు. అప్పట్లో ప్రతి దళితునికి రు. 10 లక్షల సాయాన్ని కేసీయార్ ప్రకటించారు. అయితే కేసీయార్ ఎన్ని ప్రకటనలుచేసినా బీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత దళితబంధు పథకం ఎక్కడబోయిందో ఎవరికీ తెలీదు. ఇపుడు కూడా రాబోయే ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను దృష్టిలో పెట్టుకునే మైనారిటీలందరికీ లక్ష రూపాయల సాయమని ఒక ప్రకటన చేశారు. ప్రకటనైతే చేశారు కానీ దాని అమలెట్లా ?