కొత్తగూడెం, కల్వకుర్తి, జనగామ, ఘనపూర్, దేవరకొండ, చొప్పదండి.. బీఆర్ఎస్ టికెట్ల కొట్లాట లెన్నో?
అధికార పార్టీ అంటేనే టికెట్ల రగడ సహజం అందులోనూ రెండుసార్లు గెలిచి మూడోసారి దూకుడు మీదున్న పార్టీలో టికెట్ ల కోసం కొట్లాటల సంగతి చెప్పాల్సిన పనిలేదు
By: Tupaki Desk | 3 Aug 2023 1:30 PM GMTఅధికార పార్టీ అంటేనే టికెట్ల రగడ సహజం.. అందులోనూ రెండుసార్లు గెలిచి మూడోసారి దూకుడు మీదున్న పార్టీలో టికెట్ ల కోసం కొట్లాటల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఇక కొంత ఆకట్టుకునే నాయకత్వం ఉన్న పార్టీ అయితే ఈ రగడ మరీ అధికం. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ లో నెలకొంది. ఒకటి కాదు రెండు కాదు పైపైకి పది నియోజకవర్గాల్లో టికెట్ లొల్లి కనిపిస్తోంది. నేనంటే నేనంటూ నాయకులు పైచేయికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ఎన్నిక చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వనమా చేతిలో ఓడిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. దీనిని అనుసరించి అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఆయన అదేమీ చేయలేదు. ప్రమాణ స్వీకారానికి జలగంను పిలవలేదు. కాగా, ఇదే నియోజకవర్గంలో ఇప్పటికే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారిక పదవిలో ఉన్నప్పటికీ చాలా దూకుడుగా వెళ్తున్నారు.
పెద్దల సమక్షంలోనే పంచాయితీ
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ లో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తమకు గౌరవం ఇవ్వడం లేదని, ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని నాయకులు గళమెత్తారు. అది కూడా ఎమ్మెల్యే సమక్షంలోనే కావడం గమనార్హం. ఇదే సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు. వారి ముందే నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, పీఏసీఎస్ ఛైర్మన్లు, ఇతర నాయకులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అంటే మొత్తం నియోజకవర్గ నాయకత్వమే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉంది. పోలీసులు, అధికారులను అడ్డు పెట్టుకుని సొంత పార్టీ నాయకులనే ఇబ్బంది పెడుతున్నారని అన్నట్లు తెలిసింది. దళిత బంధు, బీసీలకు సాయం విషయంలో తమ సూచనలను విస్మరిస్తున్నారని, ఆయనకు నచ్చినవారికే చోటిచ్చారని కొందరు ఆరోపించినట్లు చెబుతున్నారు.
జనగామలో జగడ జగడ
పలుసార్లు వివాదాస్పదుడైన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రెండుసార్లు గెలిచి మూడోసారీ టికెట్ నాదే అంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారంటూ జనగామ జడ్పీ చైర్మన్ ఆడియో వైరల్ కావడం సంచలనం రేపింది. అయితే, పల్లా కాదు తానే పోటీకి దిగుతున్నట్లుగా ముత్తిరెడ్డి ప్రకటించారు. వాస్తవానికి వివాదాలతో ముత్తిరెడ్డికి టికెట్ గండం పొంచి ఉందని చెబుతున్నారు. అందుకనే సీఎం కేసీఆర్ కు సన్నిహితుడైన పల్లాను దింపుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ, సీఎం చేయించిన సర్వేలో జనగామ టాప్ 10లో ఉందని టికెట్ నాదేనని ముత్తిరెడ్డి చెబుతున్నారు.
దేవర.. దేవర.. రవీంద్రకు వద్దురా..
గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గమైన దేవరకొండలోనూ టికెట్ లొల్లి సాగుతోంది. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కు మళ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యవహార శైలి కూడా బాగోలేదని ధ్వజమెత్తారు. రవీంద్రకు వ్యతిరేకంగా ఏకంగా తీర్మానం కూడా చేశారు. వీరిలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, డిండి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వంటి కీలక నేతలు ఉండడం గమనార్హం.
ఇక కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు మళ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ ఇటీవల ఆ నియోజకవర్గ నాయకులు ఓ ఫాంహౌజ్ లో సమావేశమయ్యారు. దీనిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా పాల్గొనడం గమనార్హం. స్టేషన్ ఘనపూర్ లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య ఉన్న వివాదం బహిరంగ రహస్యమే. ఇలా ఇంకెన్నీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందో..?