బీయారెస్ చాన్స్ ఇస్తుందా... వెయిటింగ్ అంటున్న కాంగ్రెస్... బీజేపీ
బీయారెస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ మంచి దూకుడు మీద ఉన్నారు
By: Tupaki Desk | 21 Aug 2023 3:55 AM GMTబీయారెస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ మంచి దూకుడు మీద ఉన్నారు. ఆయన లేటెస్ట్ గా సూర్యాపేట మీటింగ్ లో మాట్లాడుతూ ఈసారి పక్కగా గెలుస్తామని బిగ్ సౌండ్ చేశారు. విపక్షాలది డ్రామా అంటున్నారు. ఈసారి మరో అయిదారు సీట్లు ఎక్కువ వస్తాయి తప్ప తగ్గేదే లేదు అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే బీయారెస్ తొలి జాబితాకు ముహూర్తం ఫిక్స్ అయిందంటూ ప్రచారం సాగుతోంది. అందులో పది మంది దాకా సిట్టింగులకు సీట్లు కట్ అంటున్నారు. ఆ లిస్ట్ కూడా ఇపుడు ప్రచారంలోకి వచ్చేసింది. ఆసిఫాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మికి టికెట్ ఇస్తారని అంటున్నారు. అలాగే ఖానాపూర్ సీట్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్ స్థానంలో భూక్యా జాన్సన్ నాయక్ కి చాన్స్ దక్కబోతోందిట. ఇక బోథ్ సీట్లో రథోడ్ బాపూ రావు స్థానంలో అనిల్ జాదవ్ కి అవకాశం ఇస్తున్నారు.
అదే విధంగా వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ స్థానంలో చెల్మెడ లక్ష్మినర్శింహారావుకి, అలాగే, నర్సాపూర్ సీటులో మదన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి ఉప్పల్లో బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డికి, జనగామలోముత్తిరెడ్డి యాదగిరి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్లు ఇవ్వడం ఖాయమని అంటున్నారు.
అదే విధంగా స్టేషన్ ఘన్ పూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి సీటు ఇస్తున్నారు. ఇక ఎల్లందులో హరిప్రియ నాయక్ స్థానంలో గుమ్మడి అనురాధకు, వైరాలో రాములు నాయక్ స్థానంలో మదన్ లాల్ కి టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది.
మరో వైపు చొస్తే కొత్తగా కొందరికి చాన్స్ దక్కుతోంది. ఆ జాబితాలో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి, ములుగులో బడే నాగజ్యోతి, భద్రాచలం సీట్లో తెల్లం వెంకట్రావ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బుజ్జగించి వారికి బాగా చూసుకుంటామని హామీ ఇచ్చిన తరువాతనే టికెట్ల ప్రకటన ఉంటుందని బీయారెస్ వర్గాలు అంటున్నాయి. కానీ సిట్టింగులు తమకు టికెట్ రాకపోతే ఏమి చేస్తారు అన్నది ఆసక్తిగా ఉంది. సిట్టింగులు తిరుగుబాటు చేస్తే దానిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి కాంగ్రెస్ ఒక వైపు బీజేపీ మరో వైపు చూస్తున్నాయని అంటున్నారు.
మరి బీయారెస్ అధినేత ఆ చాన్స్ ఇస్తారా. తమ గీత దాటకుండా టికెట్లు రాని వారిని చూసుకుంటారా అన్నదే ఇపుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా టికెట్ దక్కకపోతే ఆవేశం పెల్లుబుకుతుంది. మరి అది ఎటు వైపు దారితీస్తుంది అన్నది చూడాల్సి ఉంది. మరి బీయారెస్ టికెట్లను ప్రకటించే ముహూర్తమే ముసలం పుట్టే ముహూర్తం కూడా అని విపక్షాలు అంటున్నాయి. మొత్తానికి తెలంగాణా రాజకీయం వేడెక్కడం ఖాయమని అంటున్నారు.