Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ లో రోడ్డెక్కుతున్న కుంపట్లు

తెలంగాణా బీఆర్ఎస్ టికెట్లను ప్రకటించే రోజు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలో కుంపట్లు రోడ్డున పడుతున్నాయి

By:  Tupaki Desk   |   22 Aug 2023 9:07 AM GMT
బీఆర్ఎస్ లో రోడ్డెక్కుతున్న కుంపట్లు
X

తెలంగాణా బీఆర్ఎస్ టికెట్లను ప్రకటించే రోజు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలో కుంపట్లు రోడ్డున పడుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగులకు ఎట్టి పరిస్ధితుల్లోను టికెట్లు ఇవ్వకూడదని నేతలు, క్యాడర్ గోల చేస్తున్నారు. ఒకవేళ టికెట్టిస్తే కచ్చితంగా ఓడగొడతామని కూడా కేసీయార్ కు వార్నింగులు పంపుతున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో తాము సూచించిన నేతకే టాకెట్లు ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇవన్నీ సరిపోవన్నట్లుగా మరికొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంఎఏల మద్దతుదారులకు, ఆశావహుల మద్దతుదారులకు మధ్య గొడవలైపోతున్నాయి.

టికెట్ల కోసం నియోజకవర్గాల్లో సీనియర్లు, సిట్టింగులనే తేడాలేకుండా ఎవరికివారుగా సమావేశాలు పెట్టేసుకుంటున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 104 మంది ఎంఎల్ఏలు బీఆర్ఎస్ వాళ్ళే ఉండటంతో గొడవలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అంబర్ పేట ఎంఎల్ఏ కాలేరు వెంకటేశ్ కు టికెట్టు ఇవ్వద్దంటు నియోజకవర్గంలోని అన్నీ వర్గాలు ఏకమయ్యాయి. మెదక్ ఎంఎల్ఏ పద్మా దేవేందరరెడ్డికి కాకుండా మైనంపల్లి రోహిత్ కు టికెట్ ఇవ్వాల్సిందే అని నేతలు తీర్మానంచేసి కేసీయార్ కు పంపారు.

భూపాలపల్లి ఎంఎల్ఏ మదుసూధనాచారికి టికెట్ ఇవ్వాలని కొందరు, ఇవ్వద్దని మరికొందరు నానా గోల చేస్తున్నారు. ఉప్పల్ టికెట్ తనకే ఇవ్వాలని బండారి లక్ష్మారెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో ఆయన్ను వ్యతిరేకిస్తు బొంతు రామ్మోహన్, భేటి శుభాష్ రెడ్డి ఏకమై కల్వకుంట్ల కవితను ఆశ్రయించారు. తమ వర్గాలతో కవిత ముందు బలప్రదర్శన కూడా చేశారు. ఇల్లెందులో ఎంఎల్ఏ హరిప్రియా నాయక్ ను టికెట్ ఇచ్చేందుకు లేదని మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద మీటింగే జరిగింది.

వైరాలో సిట్టింగ్ ఎంఎల్ఏ రాములునాయక్ కు వ్యతిరేకంగా అసమ్మతినేతలు పెద్ద సమావేశం నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎంఎల్ఏ నన్నపునేని నరేందర్ కు టికెట్ ఇవ్వకూడదని అసమ్మతినేతలు కేటీయార్ కు పదేపదే చెబుతున్నారు. మహబూబాబాద్ ఎంఎల్ఏ శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు రోడ్డెక్కారు. మహేశ్వరం, జనగామ, వేములవాడ, స్టేషన్ ఘన్ పూర్ తదితర నియోజకవర్గాల్లో కూడా ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వద్దని, సీనియర్లకు ఇవ్వద్దని అనేక గ్రూపు రోడ్డెక్కాయి. కేసీయార్ మాత్రం ఏమీ మాట్లాడకుండా తన కసరత్తేదో తాను చేసుకుంటున్నారు.