ఎన్నికల ముంగిట బీఆర్ ఎస్‌కు చలీజ్వరం... రీజనిదే!
అయితే.. ఇంత చేస్తున్న బీఆర్ ఎస్‌కు ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో చలీజ్వరం పట్టుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది
By: Tupaki Desk | 5 Sep 2023 9:21 AM GMTతెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తెరలేవనుంది. దీంతో అధికార పార్టీబీఆర్ ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఎప్పుడో చాపచుట్టి చూరులో దోపేసిన హామీలను కూడా ప్రత్యేక తవ్వకాల ద్వారా వెలికి తీసి మరీ బూజు దులిపి.. అమలుకు శ్రీకారం చుడుతు న్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆ మాత్రం చేయకపోతే.. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం అనుకున్నంత ఈజీ అయితే కాదు కదా!
అయితే.. ఇంత చేస్తున్న బీఆర్ ఎస్‌కు ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో చలీజ్వరం పట్టుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. హైదరాబాద్ నడి బొడ్డు నుంచి అనేక కాలనీలు మోకాల్లోతు నీటిలో మునిగి పోయాయి. భారీ వర్షం కారణంగా చింతల్‌లోని గణేష్ నగర్, కల్పనాసొసైటీ, శ్రీనివాస్ నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దినసరి కూలీలకు మరింత కష్టంగా మారింది.
ఇక, కీలకమైన వాణిజ్య ప్రాంతంగా డెవలప్ అయిన జీడిమెట్ల నుంచి వచ్చే కాలువ నిండి పొంగిపొర్లుతోంది. దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాలు ఈ కుండపోత వర్షాలతో నీట మునిగినప్పటికీ జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులు అటు వైపు తొంగి చూడని పరిస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ నంబర్స్ కాల్ చేస్తుంటే స్పందన కరువైంది. దీంతో స్థానికులే జీహెచ్ఎంసీ సిబ్బందిగా మారి.. సయకచర్యలు చేపట్టారు.
కట్ చేస్తే.. మరికొద్ది రోజుల్లోనే ఓట్ల కోసం బీఆర్ ఎస్ సహా ఇతర పార్టీల నాయకులు ప్రజలను ఆశ్రయించక తప్పదు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. బీఆర్ ఎస్ కు మాత్రం ఈ వానల ఎఫెక్ట్ బాగానే తగలడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. కనీసం మంత్రులు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, తలసాని శ్రీనివాసయాదవ్ కానీ.. ఏ ఒక్కరూ స్పందించకపోవడం.. ప్రజలనే జాగ్రత్తగా ఉండాలని సుద్దులు చెప్పడం వంటివి మంటెత్తిస్తున్నాయి. మొత్తంగా ఈ వర్షాల ఎఫెక్ట్ ఎన్నికల వేళ బీఆర్ ఎస్‌కు ఇబ్బంది కలిగించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.