బీజేపీ ట్రాప్‌లో కేటీఆర్, కవిత?!
బీజేపీ నేతల సారథ్యంలో రూపొందుతుందనే పేరొందిన 'రజాకార్ -ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' సినిమా ఆది నుంచి హాట్ టాపిక్ అయింది
By: Tupaki Desk | 22 Sep 2023 4:51 AM GMTతెలంగాణ పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరిపోయింది. ఓ వైపు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తుంటే మరోవైపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అస్త్రాలకు పదును పెడుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీని తమ ఎన్నికల వ్యూహంలో విజయవంతంగా బీజేపీకి ఇరికించిందని అంటున్నారు. ఓ వర్గానికి బీఆర్ఎస్ కొమ్ముకాస్తుందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపేలా చేయడంలో బీజేపీ విజయం సాధించిందని, ఆ పార్టీ నేతలు కేటీఆర్, కవిత చేస్తున్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనమనే చర్చ జరుగుతోంది.
బీజేపీ నేతల సారథ్యంలో రూపొందుతుందనే పేరొందిన 'రజాకార్ -ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' సినిమా ఆది నుంచి హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా తమను టార్గెట్ చేసే విధంగా తీశారని ఓ వర్గం వారు ఆరోపిస్తున్నారు. అయితే, నిజాం పరిపాలన నాటి అసలు నిజాలు చూపించే ప్రయత్నం చేస్తున్నామని చిత్ర బృందం చెప్తోంది. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, తదితరులు ఈ సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించినప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సెప్టెంబర్ 17న తెలంగాణా విమోచన దినం సందర్భంగా విడుదల చేసిన టీజర్ పై వివాదాలు చెలరేగాయి. మొత్తంగా ఈ సినిమా అనౌన్స్ నాటి నుంచి టీజర్ వరకు అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
ఓ నెటిజన్ ట్విట్టర్‌లో సీఎం, కేటీఆర్, బీఆర్ఎస్ ట్విట్టర్ అకౌంట్లకు ట్యాగ్ చేస్తూ... సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేవిగా రజాకార్ మూవీ టీజర్ ఉందని అందువల్ల ఈ సినిమా రిలీజ్ ను ఆపడం ద్వారా శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. దీనికి బీఆర్ఎస్ యువనేత, మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. 'తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి బీజేపీకి చెందిన కొంతమంది మేధావులు దివాళా తీసిన జోకర్లు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. తెలంగాణ శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు తెలంగాణ పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతాం' అని ట్వీట్ హామీ ఇచ్చారు.
ఇక తాజాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ సినిమాపై స్పందిస్తూ రజాకార్ సినిమాను నిర్మించింది బీజేపీ నేత అని పేర్కొన్నారు. జనాల మధ్య దూరాన్ని పెంచే అంశాలతో బీజేపీ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఏ రాష్ట్రంలోనైనా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. ఈ దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ప్రజలు పని చేయడానికి హైదరాబాద్‌కు వస్తారని, కాబట్టి శాంతిని కాపాడాలంటే ఇలాంటి వివాదాస్పద సినిమాలను తిరస్కరించాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గత పదేళ్లలో తెలంగాణ శాంతికి, మతపరమైన ఘర్షణలు లేకుండా, సామరస్యతకు పేరుగాంచిన రాష్ట్రమని కవిత తెలిపారు.
కాగా, 'రజాకర్' మూవీ టీజర్ పట్ల కేటీఆర్ ట్వీట్‌పై ఎంపీ బండి సంజయ్ స్పందించారు. రజాకార్ల వాస్తవాలను చూపించడంలో అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. హిందువుల పండుగ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పలేదు కానీ హిందువులపై రజాకార్లు చేసిన మారణహోమాన్ని చూపించిన సినిమాపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడని ఎద్దేవా చేశారు. చరిత్రను తుడిచిపెట్టే పనికిమాలిన ప్రయత్నాలకు బదులు కొంత స్పృహను కలిగించమని అందరం గణేశుడిని ప్రార్థిద్దాం అంటూ కౌంటర్ వేశారు. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి కేటీఆర్‌కు స్పెషల్ ఆఫర్ ఇచ్చారు.
మీరు, మేము కలిసి రజాకర్ మూవీ చూద్దాం రండి అంటూ ఆహ్వానం పలికారు. టీజర్ కే భయపడి నిజాం వారసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సెన్సార్ బోర్డుకి, పోలీసులకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అరాచకాల గురించి మీ నాన్న మీకు చెప్పలేదా అని ప్రశ్నించారు. బీజేపీ జోకర్ కాదని, హీరో అన్నారు. మూవీ చూసి సినిమాపై డెసిషన్ తీసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందించే విధంగా బీజేపీ తీసిన సినిమా అనుకున్నట్లు వారి లక్ష్యం నెరవేర్చిందని, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.