Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?

ఏలినవారి మనసెరిగి నడుచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అలా కాకుండా తనిష్ట వచ్చినట్లు నడుచుకుంటానంటే మాడు పగలటం ఖాయం

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:30 PM GMT
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
X

ఏలినవారి మనసెరిగి నడుచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అలా కాకుండా తనిష్ట వచ్చినట్లు నడుచుకుంటానంటే మాడు పగలటం ఖాయం. ఇపుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అయ్యిందిదే. గవర్నర్ కోటాలో ఎంఎల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరిని గవర్నర్ తిరస్కరించారు. ఇంకోసారి గవర్నర్ కోటాలో భర్తీ చేయాలని అనుకుంటున్న వాళ్ళలో ఇలాంటి వాళ్ళని సిఫారసు చేయద్దని వార్నింగ్ ఇవ్వటం నిజంగా సంచలమనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే దాదాపు మూడునెలల క్రితం గవర్నర్ కోటాలో ఇద్దరు నేతలను నామినేట్ చేస్తు క్యాబినెట్ తీర్మానించింది.

ఆ ఇద్దరు ఎవరంటే దాసోజు శ్రవణ్, కుర్రా సత్యానారాయణ అనే నేతలు. వీళ్ళల్లో దాసోజు శ్రవణ్ అనేక పార్టీలు మారిమారి చివరకు మళ్ళీ బీఆర్ఎస్ దగ్గరకే చేరారు. గవర్నర్ కోటాలో వీళ్ళిద్దరినీ ఎంఎల్సీలుగా నామినేట్ చేస్తు క్యాబినెట్ సిఫారసుచేసింది. అయితే గవర్నర్ ఈ ఫైలును తన దగ్గరే అట్టిపెట్టుకుని చివరకు సోమవారం రెజెక్టు చేశారు. అంతేకాకుండా ఇలాంటి వాళ్ళని పంపద్దని ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. నిజానికి ఈ ఇద్దరిపేర్లను సిఫారసు చేసేటప్పుడే కేసీయార్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఉండాల్సింది.

ఎందుకంటే ఒకపుడు గవర్నర్ కోటాలోనే పాడి కౌశిక్ రెడ్డి అనే నేతను సిఫారసుచేసినపుడే గవర్నర్ తిరస్కరించారు. కౌశిక్ మీదున్న కేసుల కారణంగా ప్రభుత్వం సిఫారసులను తాను ఆమోదించటంలేదని రెజెక్టు చేశారు. కేసీయార్ చేసేదిలేక తర్వాత ఎంఎల్ఏల కోటాలో ఎంఎల్సీగా ఎంపికచేయించారు. అలాంటిది రెండోసారి కూడా మళ్ళీ అలాంటి వాళ్ళిద్దరిని సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదిస్తారని కేసీయార్ ఎలాగ అనుకున్నారు ?

గవర్నర్ కోటాలో పెద్దల సభకు పేర్లు సిఫారసుచేసేటపుడు కాస్త జాగ్రత్తగా ఎంపికచేయాలి. మామూలుగా అయితే కళలు, క్రీడాకారులు, సాహిత్యం, సైన్స్, సమాజసేవ తదితర రంగాల్లో పేరున్న వాళ్ళని సిఫారసుచేయాలి. అయితే తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రులు ఎవరినిబడితే వాళ్ళని సిఫారసు చేసేస్తున్నారు. గవర్నర్లు కూడా వీటిని పట్టించుకోకుండా ఫైలును ఆమోదించేస్తున్నారు. అయితే ఇక్కడ గవర్నర్-కేసీయార్ మధ్య సంబంధాలు ఉప్పునిప్పని అందరికీ తెలిసిందే. పైగా ఒకసారి అనుభవం కూడా అయ్యింది. అయినా మళ్ళీ అదేపద్దతిలో సిఫారసు చేస్తే ఎలాగ ?