కేసీఆర్ ను భయపెడుతున్న కామారెడ్డి
కామారెడ్డి నియోజకవర్గంలో పోటీచేయాలన్న కేసీయార్ నిర్ణయం అంతగా వర్కవుటయ్యేట్లుగా కనబడటంలేదు
By: Tupaki Desk | 30 Sep 2023 1:30 PM GMTకామారెడ్డి నియోజకవర్గంలో పోటీచేయాలన్న కేసీయార్ నిర్ణయం అంతగా వర్కవుటయ్యేట్లుగా కనబడటంలేదు. ఏ ముహూర్తంలో పోటీచేయాలని నిర్ణయించుకున్నారో తెలీదు కానీ అప్పటినుండి సమస్యలు అన్నీవైపుల నుండి కమ్ముకుంటున్నాయి. తాజాగా శనివారం నాడు కామారెడ్డి నియోజకవర్గం కేంద్రంలో 'హలో లబానా..చలో కామారెడ్డి' అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. లబానా లంబాడీల ఆధ్వర్యంలో 30వ తేదీన భారీ ర్యాలీ నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ర్యాలీ కేసీయార్ కు వ్యతిరేకంగానే వీళ్ళు చేయబోతున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే లబానా లంబాడీలు ఇపుడు ఓసీ కేటగిరీలో ఉన్నారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎప్పటినుండి డిమాండ్ చేస్తున్నారు. మామూలుగా లంబాడీలు అనగానే ఎస్టీలనే అనుకుంటారు. కానీ లబాడా లంబాడీలు మాత్రం ఓసీ కేటగిరీలోకి ఎలా వచ్చారో అర్ధం కావటం లేదు. గతంలో కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ కు వచ్చిన కేసీయార్ ను లంబాడా సంఘం పెద్దలు కలిసి తమను ఎస్టీల్లో చేర్చాలని రిక్వెస్టు చేసుకున్నారు. అందుకు కేసీయార్ అంగీకరించారు కూడా.
అయితే తర్వాత ఆ విషయాన్ని కేసీఆర్ పక్కన పెట్టేశారు. తర్వాత ఎన్నిసార్లు నేతలు కలిసినా ఉపయోగం కనబడలేదు. ఇపుడు ఎన్నికలు వస్తున్నాయి కదా అందుకనే వీళ్ళు తమ డిమాండును తెరపైకి తెచ్చారు. తమను వెంటనే ఎస్టీల్లో చేర్చితే సరి లేకపోతే కేసీయార్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తామని ప్రకటించారు. కామారెడ్డిలో లబాడా లంబాడీల తరపున 1016 మంది నామినేషన్లు వేయాలని ఇప్పటికే సంఘం డిసైడ్ చేసింది. జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో లబాడాలు సుమారు 25 వేలమంది ఉన్నారు.
తమ డిమాండుతో లబాడాలు కామారెడ్డిలో శనివారం భారీ మీటింగు కూడా పెట్టుకున్నారు. మరి కేసీయార్, అధికార పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సింది. ఇప్పటికే నియోజకవర్గంలోని గల్ఫ్ బాధిత కుటుంబాల వాళ్ళు, ముదిరాజ్ సామాజికవర్గం మండిపోతున్న విషయం తెలిసిందే. తమను పట్టించుకోని కేసీయార్ ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశ్యంతో గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం గట్టిగా నిర్ణయించుకున్నది. నియోజకవర్గంలో గల్ఫ్ బాధితుల కుటుంబాల ఓట్లు సుమారు 30 వేలుంటాయని అంచనా. వీళ్ళలో వందమంది నామినేషన్లు వేయాలని డిసైడ్ చేశారు. వీళ్ళకి అదనంగా ముదిరాజ్ లు తోడయ్యారు. అందుకనే కేసీయార్ను సమస్యలు అన్నీవైపుల నుండి కమ్ముకుంటున్నట్లే అనిపిస్తోంది.