ఇదెక్కడి సిత్రం? గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీకి గుండుసున్నా!
తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఊహించని సిత్రం ఒకటి నెలకొంది
By: Tupaki Desk | 3 Dec 2023 8:30 AM GMTతెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఊహించని సిత్రం ఒకటి నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి జోరు ఓ రేంజ్ లో ఉంటే.. అందుకు భిన్నంగా గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించిన వారిలో సైతం ఎవరూ అంచనా కట్టలేని రీతిలో.. గ్రేటర్ ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో కాస్త ఆలస్యంగా వెల్లడైన ఇండియా టుడే ఫలితాన్ని చూసినప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి ఆ సర్వేలో కేవలం మూడు స్థానాలే ఇచ్చారు.
అప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం కనిష్ఠంగా ఐదు.. గరిష్ఠంగా ఏడు స్థానాలు ఉన్నాయి. అయితే.. తాజాగా వెల్లడైన ఫలితాల్ని చూసినప్పుడు మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలు వస్తున్న పరిస్థితి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెల్లడైన ఫలితాల్ని చూస్తే.. 22 నియోజకవర్గాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో 14 స్థానాల్లో అధికార బీఆర్ఎస్ విజయాన్నిసాధిస్తున్న పరిస్థితి. అందరి మెజార్టీలు ఇప్పుడు గెలుపు దిశగా వెళుతున్నాయి.
మిగిలిన ఎనిమిది స్థానాల్లో ఏడు సిట్టింగ్ స్థానాలున్న మజ్లిస్ కు ఇప్పటివరకు చార్మినార్ స్థానంలో మజ్లిస్ విజయం సాధించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. మిగిలిన ఆరుస్థానాల్లో కార్వాన్.. యాకత్ పుర రెండు మినహా మిగిలిన నాలుగు స్థానాల్లో అధిక్యతలో ఉంది. ఎప్పటిలానే బీజేపీకి పట్టున్న గోషామహాల్ లో ఆ పార్టీ అభ్యర్థి రాజాసింగ్ లీడింగ్ లో ఉన్నారు. మొత్తంగా చూస్తే.. గ్రేటర్ లోని 22 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గుండుసున్నా రావటం షాకింగ్ గా మారింది. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెప్పినా.. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నాయి.