Begin typing your search above and press return to search.

అప్పులు తీర్చటానికి మళ్ళీ అప్పులా ?

తెలంగాణా ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి మీద కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది

By:  Tupaki Desk   |   8 Aug 2023 12:00 PM GMT
అప్పులు తీర్చటానికి మళ్ళీ అప్పులా ?
X

తెలంగాణా ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి మీద కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. అప్పులను ఏ ప్రభుత్వమైనా సంపద సృష్టికి చేస్తుంది కానీ కేసీయార్ ప్రభుత్వం మాత్రం పాత అప్పులు తీర్చటానికే కొత్త అప్పులు చేస్తోందన్నారు. తీసుకొస్తున్న అప్పుల్లో ప్రాజెక్టుల మీద చేస్తున్న ఖర్చులు కొద్దిమాత్రమే అని మిగిలిందంతా బిల్లులు చెల్లింపులు, పాత అప్పులకు వడ్డీలు కట్టడం, అసలు చెల్లించటంపైనే ఖర్చు చేస్తోందని కాగ్ స్పష్టంగా తన రిపోర్టులో చెప్పింది.

రాష్ట్రానికి సమకూరుతున్న రెవిన్యులో 46 శాతం తప్పించుకోలేని అవసరాల కోసమే ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్లు కాగ్ చెప్పింది. రాష్ట్రానికి వస్తున్న ఆర్ధిక వనరుల్లో సుమారు సగభాగం ఉద్యోగుల జీత, బత్యాలకు, రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్లు, అప్పుల మీద వడ్డీలు, అసలు చెల్లింపు లాంటి అవసరాల కోసమే ఖర్చయిపోతోందని చెప్పింది. గడచిన ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వానికి రు. 1.27 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందట. అందులో రు. 30 వేల కోట్లు జీతాల కోసం, రు. 19 వేల కోట్లు అప్పులకు చెల్లించాల్సిన వడ్డీల కోసం, రు. 14 వేల కోట్లు పెన్షన్లకు ఖర్చుచేసినట్లు కాగ్ వివరించింది.

తెలంగాణా ప్రభుత్వం అనికాదు కానీ దేశంలోని అన్నీ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్ధితి దాదాపు ఒకేలాగున్నది. దేశంలోని ఏ ఒక్కప్రభుత్వం కూడా మిగులు బడ్జెట్లో లేదన్న విషయం వాస్తవమన్నారు. ప్రతి ప్రభుత్వం లోటు బడ్జెట్లోను, అప్పులతోనే పరిపాలన చేస్తున్నాయి.

ఇదంతా ఎందుకంటే కేంద్రప్రభుత్వం కూడా స్వయంగా అప్పుల్లోనే ముణిగిపోయింది. నరేంద్రమోడీ ప్రభుత్వం 157 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముణగిపోయుంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి సుమారు 60 ఏళ్ళు వివిధ ప్రభుత్వాలు 56 లక్షల కోట్లు అప్పులు చేశాయి. అయితే మోడీ ప్రభుత్వం ఒక్కటే గడచిన పదేళ్ళల్లో సుమారు 1 కోటి కోట్ల రూపాయల అప్పుచేసింది. ఇంత అప్పు ఎందుకు చేసిందంటే సమాధానం ఉండటంలేదు. కాబట్టి కాగ్ రిపోర్టులు ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాయి, సభలో ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రవేశపెడుతున్నాయంతే.