Begin typing your search above and press return to search.

కిందిస్థాయిలో పార్టీ వీకైపోతోందా ?

ఇపుడు సమస్య ఏమైందంటే కిందస్ధాయిలో పార్టీ బలహీనమైపోతోందని అర్ధమవుతోంది. ఎలాగంటే మున్సిపల్ కౌన్సిలర్లు, ఛైర్మన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 3:30 PM GMT
కిందిస్థాయిలో పార్టీ వీకైపోతోందా ?
X

భవనం బలంగా పదికాలాల పాటు నిలవాలంటే పునాది చాలా బలంగా ఉండాలి. రాజకీయ పార్టీలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందన్నా, బీఆర్ఎస్ ఓడిపోయిందన్నా గ్రౌండ్ లెవల్లో మార్పులు రావటమే కారణం. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ పుంజుకుని గెలిచిందంటే క్షేత్రస్థాయిలో నేతలు, క్యాడర్ బలంగా తయారవ్వటమే. దానికి అదనంగా నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఇపుడు గెలవకపోతే పార్టీకి భవిష్యత్తు లేదన్న భయంతోనే కలిసికట్టుగా కష్టపడ్డారు. నేతలు, క్యాడర్ అంతా కలిసి పనిచేసిన కారణంగానే విజయం సాధించింది.

ఇదే విధమైన పోరాటం బీఆర్ఎస్ లో లోపించింది. లోపించటమే కాకుండా ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ అభ్యర్ధులకు వ్యతిరేకమైపోయారు. ఈ విషయాలను రివ్యూ మీటింగుల్లో సీనియర్ నేతలే బహిరంగంగా అంగీకరిస్తున్నారు. ఇపుడిదంతా ఎందుకంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఎలాగనే విషయమై పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుగుతున్నాయి. కేటీయార్ చేస్తున్న సమీక్షల్లో చాలామంది నేతలు గ్రౌండ్ లెవల్లోని కష్టాలను ఏకరవు పెడుతున్నారు.

ఇపుడు సమస్య ఏమైందంటే కిందస్ధాయిలో పార్టీ బలహీనమైపోతోందని అర్ధమవుతోంది. ఎలాగంటే మున్సిపల్ కౌన్సిలర్లు, ఛైర్మన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. దాదాపు ఐదు మున్సిపాలిటీల్లో అధికారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది. ఈనెలలోనే మరో పది మున్సిపాలిటీల్లో అధికారం మారిపోవటానికి రంగం సిద్ధమైంది. ఛైర్మన్లపై కౌన్సిలర్లు అవిశ్వాసతీర్మానాలు ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాజీనామాలు చేసి కాంగ్రెస్ లో చేరిపోతుండటంతో బీఆర్ఎస్ బాగా వీకైపోతోంది.

పార్లమెంటు ఎన్నికల నోటిపికేషన్ లోపు చాలా మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడిపోవటం ఖాయం. అప్పుడు బీఆర్ఎస్ కు క్షేత్రస్ధాయిలో గట్టిగా పనిచేసే నేతలు తగ్గిపోతారు. ఇపుడిదే అంశంపై పార్టీ సమీక్షా సమావేశాల్లో నేతల్లో బాగా టెన్షన్ కనబడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లో కూడా రిపీటయ్యే అవకాశాలే ఎక్కువగా ఉందనే అనుమానాలు బీఆర్ఎస్ లో పెరిగిపోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకుండానే బీఆర్ఎస్ లో ఓటమిభయం పెరిగిపోతుండటమే కాంగ్రెస్ కు మొదటి విజయం అనుకోవచ్చు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.