Begin typing your search above and press return to search.

జమిలితో బీఆర్ఎస్ కు కష్టమేనా ?

తాజా రిపోర్టు ప్రకారం జమిలి ఎన్నికలు జరిగితే నష్టపోయేది బీఆర్ఎస్సే అని స్పష్టమైందట. ఇపుడు బీఆర్ఎస్ ఓటుషేర్ 38 శాతం ఉన్నట్లు చెప్పింది.

By:  Tupaki Desk   |   11 Sep 2023 4:20 AM GMT
జమిలితో బీఆర్ఎస్ కు కష్టమేనా ?
X

జమిలి ఎన్నికలు..ఇపుడిదే అంశం అన్నీ పార్టీల్లోను హాట్ టాపిక్ అయిపోయింది. జమిలి ఎన్నికలు జరిగితే నష్టపోయే పార్టీలేవి, లాభపడే పార్టీలు ఏవి అన్న విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. పార్టీలన్నీ దేని లెక్కల్లో అవున్నాయి. ఈ నేపధ్యంలోనే తెలంగాణా ఇంటెన్షన్స్ అనే సంస్ధ తెలంగాణా ఎన్నికలపై ప్రతివారం సర్వే చేస్తుంటుంది. ఈ సర్వేలో ఏ పార్టీ పరిస్ధితి ఎలాగుంది అనే విషయంపై ప్రతివారం ఒక రిపోర్టు విడుదల చేస్తోంది.

తాజా రిపోర్టు ప్రకారం జమిలి ఎన్నికలు జరిగితే నష్టపోయేది బీఆర్ఎస్సే అని స్పష్టమైందట. ఇపుడు బీఆర్ఎస్ ఓటుషేర్ 38 శాతం ఉన్నట్లు చెప్పింది. అదే జమిలి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఓటుషేర్ 3-4 శాతం పడిపోతుందని తేలిందట. ఇదే సమయంలో కాంగ్రెస్ ఓటుషేర్ పెరుగుతుందని తేలిందని సమాచారం. అయితే బీజేపీ ఓటుషేర్లో మాత్రం ఎలాంటి తేడా కనబడలేదట. ఒకపుడు బీఆర్ఎస్ ఓటుషేర్ 38 శాతం, కాంగ్రెస్ ఓటుషేర్ 29 శాతం ఉండేది.

అయితే రోజులు గడిచేకొద్దీ బీఆర్ఎస్ పై జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత కారణంగా ఓటుషేర్ తగ్గిపోతోందని సమాచారం. దీనికి అదనంగా జమిలి ఎన్నికలు వస్తే దాని ప్రభావం నెగిటివ్ గా పార్టీ పడుతుందట. అసెంబ్లీ, పార్లమెంటుకు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ఒకే పార్టీకి ఓట్లేస్తామని 60 శాతం అభిప్రాయపడ్డారట. 26 శాతం మంది క్రాస్ ఓటింగ్ చేస్తామని అన్నారు. మిగిలిన వాళ్ళు ఏమీ చెప్పలేమని చెప్పారట.

క్రాస్ ఓటింగ్ చేస్తామని చెప్పిన వాళ్ళల్లో అత్యధికులు అసెంబ్లీకి బీఆర్ఎస్ కు ఓటేసినా పార్లమెంటుకు కాంగ్రెస్ లేదా బీజేపీకి వేస్తామని చెప్పారట. ఈ లెక్కన బీఆర్ఎస్ ఓటుషేరుకు బొక్కపడటం ఖాయమని సర్వేలో తేలిందని తెలంగాణా ఇంటెన్షన్స్ ప్రకటించింది. ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ కు గట్టిపోటి కాంగ్రెస్ తో నే ఉండబోతోందనే విషయం స్పష్టమైపోతోంది. జనాలను ఆకర్షించేందుకు కేసీయార్ అనేక సంక్షేమపథకాలు అమలుచేస్తున్నా అవేవీ అక్కరకు వచ్చేట్లుగా కనబడటంలేదు. ఎందుకంటే అమలుచేస్తున్న పథకాలు కూడా అరాకొరా చేస్తుండటమే ముఖ్య కారణంగా కనిపిస్తోంది. మరి చివరకు ఎన్నికల్లో ఏమవుతుందో చూడాల్సిందే.