ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బతికిపోయారు
ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ బతికిపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 16 Aug 2023 3:00 AM GMTబీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి చింతా లేకుండా సన్నద్ధమవొచ్చు. ఆయన ఎన్నిక వివాదంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేయడమే అందుకు కారణం.
ఇది వ్యక్తిగతంగా ఆయనతో పాటు బీఆర్ఎస్‌కు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చేదే. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలపై ఎన్నిక రద్దు చేయాలనే పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ బతికిపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డిపై మర్రి జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. కానీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో మర్రి జనార్ధన్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించలేదని, ఆయన ఎన్నిక చెల్లదని నాగం పిటిషన్ వేశారు. మర్రి జనార్ధన్ రెడ్డి భార్య జమునా రాణి కాకతీయ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా ఉన్నారని, ఆమెకు షేర్లు ఉన్నాయనే విషయాన్ని అఫిడవిట్‌లో పేర్కొనలేదని నాగం పిటిషన్‌లో తెలిపారు.
అయితే అఫిడవిట్ సమర్పించే సమయానికి జమునా రాణి ఆ కంపెనీలో డైరెక్టర్ కాదని మర్రి జనార్ధన్ రెడ్డి వర్గం న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
తెలుగు దేశం పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన మర్రి జనార్ధన్ రెడ్డి 2014 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కూచుకళ్ల దామోదర్‌రెడ్డిపై గెలిచారు. 2018లో అయితే నాగం జనార్ధన్ రెడ్డిపై ఏకంగా 54,354 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సారి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన మర్రి జనార్ధన్ రెడ్డికి.. ఇప్పుడీ హైకోర్టు తీర్పు గొప్ప ఊరట కలిగించిందనే చెప్పాలి.