ఫామ్ హౌస్ లో గెలిచిన అభ్యర్థులకు కేసీఆర్ చెప్పిందేంటి?
మొత్తంగా ఎప్పటిలానే తనకు తోచినట్లు.. తనకు నచ్చినట్లుగా చేశారే తప్పించి ప్రజల గురించి ఆలోచించినట్లుగా కనిపించదు
By: Tupaki Desk | 5 Dec 2023 4:09 AM GMTఎన్నికల ఫలితాలు వెల్లడై.. ప్రభుత్వం గద్దె దిగాల్సి రావటం.. ఎమ్మెల్యేగా తాను పోటీ చేసిన రెండుస్థానాల్లో ఒక చోట ఓడిపోవటం లాంటి సన్నివేశాల వేళ.. కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేసి.. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లిపోవటం తెలిసిందే. గుట్టుచప్పుడు కాకుండా.. సెక్యూరిటీని వదిలేసి.. ప్రైవేటు వాహనంలో వెళ్లిపోయిన ఆయన.. ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లుగా ప్రజలకు చెప్పింది లేదు. గెలిచిన వేళ.. క్రెడిట్ అంతా తనదే అన్నట్లుగా గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. ఓడిన వేళ.. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని చెప్పింది లేదు.
మొత్తంగా ఎప్పటిలానే తనకు తోచినట్లు.. తనకు నచ్చినట్లుగా చేశారే తప్పించి ప్రజల గురించి ఆలోచించినట్లుగా కనిపించదు. కట్ చేస్తే.. సోమవారం గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు.. కొందరు ఓడిన వారు కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లటం తెలిసిందే. అక్కడ అందరూ కూర్చున్న వేళ.. వారిని కలిసి.. కాసేపు వారితో ముచ్చటించినట్లుగా మీడయాలో వార్తలు వచ్చాయి. ఇంతకూ.. ఫామ్ హౌస్ లో ఏం జరిగింది? గెలిచిన వారితో మాట్లాడే క్రమంలో కేసీఆర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలేంటి? లాంటి ప్రశ్నలకు ప్రముఖ మీడియా సంస్థలు సైతం పెద్దగా చెప్పింది లేదు.
అయితే.. మీడియాలో వార్తల రూపంలో రాలేదు కానీ.. అంచనాలకు మించినట్లుగా కేసీఆర్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఓటమిపై విచారం ఉన్నప్పటికీ..రానున్న రోజుల్లో అధికారం తమదేనన్న ధీమా కనిపించటం చాలామందిని విస్మయానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజాతీర్పును గౌరవిద్దామన్న మాటను చెబుతూనే.. మరోమూడునెలల్లోనే కొత్త ప్రభుత్వం పస తెలిసిపోతుందన్న మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికలలోపే.. కొత్త ప్రభుత్వానికి పరీక్షలు ఎదురవుతాయన్న ధీమాను వ్యక్తం చేయటం గమనార్హం. ఏం జరుగుతుందో వెయిట్ చేద్దామని చెబుతూనే.. ఎక్కువ కాలం నిరీక్షించాల్సిన సమయం ఉండదన్నట్లుగా గులాబీ బాస్ మాటలు ఉండటం ఒక ఎత్తు అయితే.. త్వరలోనే ఓటమిపై సమీక్ష జరుపుదామని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. కొత్త ప్రభుత్వం ఎక్కువకాలం మనగలిగే పరిస్థితుల్లో ఉండన్న భావన కేసీఆర్ నోటి మాటల్లో ధ్వనించిందని చెబుతున్నారు. అయితే..ఈ ధీమా వెనుక వ్యూహం ఉందా? నిజంగానే.. ఆయన ఆ తరహా అంచనాలో ఉన్నారా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో అదేమిటన్న దానిపై స్పష్టత రావొచ్చని చెబుతున్నారు.