Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ సిట్టింగులపై ఆయోమయం?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పదిసీట్లకు తక్కువ కాకుండా గెలుచుకోవాలని గతంలోనే కేసీయార్ టార్గెట్ ఫిక్సయ్యారు

By:  Tupaki Desk   |   3 Jan 2024 11:00 PM IST
బీఆర్ఎస్ సిట్టింగులపై ఆయోమయం?
X

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పదిసీట్లకు తక్కువ కాకుండా గెలుచుకోవాలని గతంలోనే కేసీయార్ టార్గెట్ ఫిక్సయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ప్లాన్లన్నీ తారుమారైపోయాయి. మరి రాబోయే ఎన్నికల్లో ఎన్ని లోక్ సభ సీట్లలో పార్టీ గెలుస్తుందనే విషయమై పార్టీలో అయోమయం పెరిగిపోతోంది. బీఆర్ఎస్ కు ఇపుడు 9 ఎంపీలున్నారు. వీళ్ళు తిరిగి గెలుస్తారా అన్నది కూడా అనుమానంగానే తయారైంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పబ్లిక్ ఓటింగ్ మూడ్ చూసిన తర్వాత అందరికీ ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ గెలవలేదు. అలాగే భద్రాచలం పార్లమెంటు పరిధిలో గెలిచింది ఒకే ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే. ఇలాగే వరంగల్, నల్గొండ జిల్లాల్లో మ్యాగ్జిమమ్ సీట్లను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకున్నది. ఈ లెక్కన చూస్తే ఇపుడున్న సీట్లు గెలవటం కూడా కష్టమనే చెప్పాలి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఓటింగే రిపీటైతే గ్రేటర్ హైదరాబాద్ , మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి పరిధిలో ఏమైనా సీట్లు గెలిచే అవకాశాలున్నాయంతే.

అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి పాలనతో జనాలు హ్యాపీగా ఉన్నారు. సిక్స్ గ్యారెంటీస్ లో రెండు హామీలను అమల్లోకి తెచ్చారు. ఈ నెలాఖరులోగా మరో హామీని అమల్లోకి తేబోతున్నారు. కేసీయార్ పదేళ్ళ పాలనలో జరిగిన అవకతవకలను, అవినీతి, అరాచకాలను ప్రభుత్వం ఒక్కోటి బయటపెడుతున్నది. వీటిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఇదే సమయంలో ప్రజలు మెచ్చేట్లుగా రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మ్యాగ్జిమమ్ సీట్లను గెలుచుకోవటమే టార్గెట్ గా రేవంత్ పావులు కదుపుతున్నారు. మొన్న రాజీనామాలు చేయకుముందు కాంగ్రెస్ కు మూడు ఎంపీ సీట్లుండేవి. రాబోయే ఎన్నికల్లో తక్కువలో తక్కువ 16 సీట్లను గెలుచుకోవాలని రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నారు. హైదరాబాద్ స్ధానాన్ని ఎంఐఎం గెలుచుకున్నా మిగిలిన 16 స్ధానాల్లో బీఆర్ఎస్, బీజేపీకి ఒక్కటి కూడా వదలకూడదన్నది రేవంత్ పట్టుదలగా ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.