పీకుడు భాషేంది సార్లూ... బీయారెస్ లో ఏం జరుగుతోంది....?
సర్వేలు అని అంటారు కానీ వాటికి మించి నేతలు వాడే భాష. వారి ఆవేశ కావేశాలు వారు ముఖాలలో భావాలు, వారి విమర్శలలో వచ్చే దూషణలు అన్నీ కూడా ఆయా పార్టీల జాతకాలు చెప్పేస్తాయని అంటున్నారు.
By: Tupaki Desk | 21 Nov 2023 3:00 AM GMTభాష ఏ నేతకు అయినా చాలా ముఖ్యం. అందునా ఎన్నికల వేళ ఓటరు దేవుళ్ళ ముందుకు వెళ్తున్నపుడు ఇంకా జాగ్రత్త అవసరం. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు కూడా దాన్ని చాలా గట్టిగానే తీసుకుంటారు. సర్వేలు అని అంటారు కానీ వాటికి మించి నేతలు వాడే భాష. వారి ఆవేశ కావేశాలు వారు ముఖాలలో భావాలు, వారి విమర్శలలో వచ్చే దూషణలు అన్నీ కూడా ఆయా పార్టీల జాతకాలు చెప్పేస్తాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే బీయారెస్ అగ్రనాయకత్వానికి ఏమైంది అన్న చర్చ సాగుతోంది. కేసీయార్ ఎన్నికల వేళ అయినా మరో సందర్భం అయినా హుందాగానే చాలా వరకూ మాట్లాడుతారు అని పేరు. భాష విషయంలో కేసీయార్ ని చూసుకోవాల్సింది లేదు. అలాంటి కేసీయార్ ఇటీవల తరచూ సహనం కోల్పోతున్నారా అన్న చర్చ నడుస్తోంది.
రాహుల్ గాంధీకి తెలంగాణాలో ఏమి పని ఏమి అంటూ కేసీయార్ ఫైర్ అయ్యారు. నిజంగా ఎన్నికలలో ప్రచారం చేయడానికి రాహుల్ గాంధీ వచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా కాలం ఉమ్మడి ఏపీని పాలించింది. నాడు ఆ పార్టీ ప్రభుత్వంలో మంచీ చెడ్డా రెండూ జరిగాయి. చెడు జరిగిందని జనాలు భావించినపుడల్లా ఓడించారు.
అదే కదా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇపుడు మరో చాన్స్ కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. మరి జాతీయ పార్టీగా కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడమే పని. ఏమి చేసిండ్రు, ఏమి పీకిండ్రు అంటే జనాలే తీర్పు చెప్పాలి. కానీ బీయారెస్ అగ్ర నేతలు ఎందుకు ఆవేశానికి లోను అవుతున్నారో అర్ధం కావడంలేదు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఉమ్మడి ఏపీని 55 ఏళ్లు పాలించిన చెత్త నా కొడుకులు ఏం పీకిర్రు అని ఏకంగా కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అవడమూ సంచలనం రేపుతోంది. మంత్రి కేటీఆర్ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తామే భువనగిరిని అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ 55 ఏళ్లు పాలించిన చెత్త నా కొడుకులు డిగ్రీ కాలేజీ ఇయ్యకుండా ఇప్పుడు డిగ్రీ కాలేజీ అడుగుతున్నారని మండిపడ్డారు.
అంతే కాదు అలా అడగడానికి సిగ్గుండాలని కూడా అన్నారు. అడగడానికి ఇజ్జతి మానం ఉండాలే. 55 ఏళ్లు పాలించిన చెత్త నా కొడుకులు ఇవాళ వచ్చి అది లేకపాయే ఇది లేకపాయే అంటే వీపులు పగల కొట్టే వాడు లేకనా అంటూ నిప్పులు చెరిగారు. భువనగిరిని జిల్లా చేసింది ఎవరు? కేసీఆరే కదా అని కేటీయార్ అంటూ తమకు సాటి పోటీ లేదని చెప్పుకొచ్చారు.
ఇక ఏమీ లేదు 30వ తారీఖు నాడు ఎవ్వడు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోవుడే అంటూ మంత్రి కేటీఆర్ సహనం కోల్పోయి కాంగ్రెస్ పై మండిపడ్డారని అంటున్నారు. అసలు ఎందుకు కేసీయార్ కేటీయార్ సహనం కోల్పోతున్నారు అన్నదే ప్రశ్న. తెలంగాణా రాష్ట్రం అంటే తమ సొంత జాగీరు కింద భావిస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అయినా అయిదేళ్ళు మాత్రమే అధికారం అప్పగిస్తారు. దాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత బాగా పాలించినా కూడా బోర్ కొట్టినా మార్పు అనుకున్నా వేరే పార్టీకి ఓటేస్తారు. ఇందులో కొత్తగా ఏమీ లేదు కూడా.
బీయారెస్ ఓడితే బాగా పాలించలేదని అర్ధం కూడా కాకపోవచ్చు. కాంగ్రెస్ కి మరో చాన్స్ ఇవ్వాలని ఆలోచించినా అధికారం మారవచ్చు. దేన్ని అయినా పాజిటివ్ గా తీసుకోవాలి కానీ తామే శాశ్వతం అధికారం ఎల్లకాలం తమ వద్దే ఉండాలన్న్న భావన ఎవరికీ మంచిది కాదని అంటున్నారు ప్రజాస్వామ్య హితైషులు.