కాల మహిమ అంటే ఇదే.. ఫిరాయింపులపై స్పీకర్ వద్దకు బీఆర్ఎస్
కాల మహిమ అంటే ఇదేనేమో..? అధికారంలో ఉండగా.. ప్రత్యర్థి పార్టీలను నిలువునా చీల్చిన బీఆర్ఎస్
By: Tupaki Desk | 16 July 2024 2:30 PM GMTకాల మహిమ అంటే ఇదేనేమో..? అధికారంలో ఉండగా.. ప్రత్యర్థి పార్టీలను నిలువునా చీల్చిన బీఆర్ఎస్.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పట్టించుకోని బీఆర్ఎస్.. ఇప్పుడు అదే అంశాలపై ఆరోపణలు చేస్తూ స్పీకర్ వద్దకు వెళ్లింది. ‘‘ఫిరాయింపులు ఆపండి.. ప్రొటోకాల్ పాటించేలా చూడండి’’ అంటూ మొరపెట్టుకుంది. తమ పార్టీ గుర్తుపై గెలిచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడ్డారని.. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటోంది. ఫిరాయింపు పిటిషన్ మీద నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కే ఉందని కోరుతోంది.
అప్పట్లో తొక్కిపెట్టి..
2014లో ఇప్పటి కాంగ్రెస్ లాగానే 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్. కానీ, రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరినీ చేర్చుకున్నారు. 2018లో అయితే.. 88 సీట్లతో భారీ మెజారిటీ వచ్చినా కేసీఆర్ సరిపెట్టుకోలేదు. ఏకంగా కాంగ్రెస్ శాసనసభా పక్షాన్నే కలిపేసుకున్నారు. ఐదేళ్లు తిరిగేసరికి కాలం మారిపోయింది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ శాసన సభా పక్షాన్ని కాంగ్రెస్ కలిపేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే 38 మంది కారు పార్టీ ఎమ్మెల్యేల్లో 10 మందిని లాగేసింది. ఇంకో 16 మందినీ బీఆర్ఎస్ శాసన సభా పక్షం విలీనమైనట్లే. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ను మంగళవారం బీఆర్ఎస్ ప్రతినిధుల టీమ్ కలిసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టులు చెబుతున్నాయని.. ఆ మేరకు అనర్హత పిటిషన్ల మీద వెంటనే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ కే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. కోర్టులు జోక్యం చేసుకునేవరకు పరిస్థితి రానీయొద్దంటూ కేటీఆర్ సూచించినట్లు తెలిసింది.
బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే..
స్పీకర్ ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలను చేర్చుకుని కాంగ్రెస్ మురిసిపోతోందని.. కాంగ్రెస్ ఎంపీలు వెళ్లిపోతే ఆ పార్టీని ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ అన్నారని.. తమ పార్టీ నుంచి వెళ్లినవారిని ఏ రాయితో కొట్టాలని అడిగారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ తీరుపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. కరెంట్‌పై కమిషన్ వేసి కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకుంటోందని.. విచారణ కమిషన్ ముందే తీర్పు చెప్తే ఎలా అని నిలదీశారు. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ పక్షపాతంగా వ్యవహరించినందుకే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందని పేర్కొన్నారు.
కాగా, నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పక్కనబెట్టి ఓడిపోయిన కాంగ్రెస్ నేతలతో కార్యక్రమాలు చేయిస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రతినిధులు స్పీకర్‌కు విన్నవించారు. ఇదెక్కడి ప్రొటోకాల్ అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా హక్కులను కాపాడాలంటూ స్పీకర్ కు వినతిపత్రం సమర్పించారు. అధికారులు సైతం తమ పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని వాపోయారు. కాగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఓడిన అభ్యర్థులతో కార్యక్రమాలు చేయించడాన్ని ఇదేం ప్రజాపాలన అంటూ మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా ఓడిన అభ్యర్థులతో కార్యక్రమాలు చేయిస్తారా? అంటూ నిలదీశారు. అసెంబ్లీకి కూడా వాళ్లనే పిలవండి అంటూ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఎద్దేవా చేశారు.