Begin typing your search above and press return to search.

ఆ 5 ఎంపీ సీట్లలో అందరూ ‘బీఆర్ఎస్’ అభ్యర్థులే

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం తెలంగాణలో బీఆర్ఎస్ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 April 2024 11:30 PM GMT
ఆ 5 ఎంపీ సీట్లలో అందరూ ‘బీఆర్ఎస్’ అభ్యర్థులే
X

ఎన్నికలంటే నాలుగైదు ప్రధాన పార్టీలు.. రెండు, మూడు చిన్న పార్టీల అభ్యర్థులు.. స్వతంత్రలు.. ఆయా పార్టీల టికెట్ దక్కని తిరుగుబాటుదారులు.. ఇలా పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఇది సహజం. ఇక ఎన్నికల సమయంలో చాలామంది నాయకులు అటునుంచి ఇటు, ఇటునుంచి అటు పార్టీలు మారుతుంటారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి తెలంగాణలో మరింత చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.

1) బీఆర్ఎస్ నుంచి వెళ్లి.. బీఆర్ఎస్ పైనే

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం తెలంగాణలో బీఆర్ఎస్ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నాయకులు వలస వెళ్లడం కాదు.. ఎమ్మెల్యేలు, ఆఖరికి ఎంపీ టికెట్ దక్కిన, దక్కుతుందనుకున్న అభ్యర్థులూ వెళ్లిపోతుండడమే ఆశ్చర్యకరం. దీంతో ఓ ఐదు నియోజకవర్గాల్లో చూస్తే.. మొత్తం బీఆర్ఎస్ మాజీలు, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనే పోటీ జరగనుంది.

2) ఉద్యమాల గడ్డ నుంచి..

వరంగల్ అంటే తెలంగాణ ఉద్యమ అడ్డా. అలాంటి గడ్డలో మాజీ డిప్యూటీ సీఎం కడియ శ్రీహరి కుమార్తె కావ్యకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చింది. కానీ, ఎమ్మెల్యేగా ఉన్న శ్రీహరి కూతురుతో కలిసి కాంగ్రెస్ లో వెళ్లారు. ఇదే స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్. ఈయనను బీజేపీలోకి వెళ్లకుండా నిలువరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా అవి విజయవంతం కాలేదు. ఇక శుక్రవారం బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్ ను ప్రకటించింది.

3) సీఎం రేవంత్ స్థానంలో..

గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి గెలిచారు. ఇప్పుడు అక్కడ నుంచి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి బరిలో నిలిచారు. ఈమె భర్త మహేందర్ రెడ్డి మొన్నటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సంతతి తెలిసిందే. ఇక బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ లో ఒకప్పుడు నెంబర్ 2గా చెలామణీ అయిన ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చింది.

4) రంజిత్ రెడ్డి-కొండా నడుమ

చేవెళ్ల నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి బీజేపీకి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై గెలుపొందారు. ఈసారి రంజిత్ రెడ్డికి టికెట్ ఖాయమైనా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. హస్తం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే, బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ కు టికెట్ కేటాయించింది. ఈయన అసెంబ్లీ ఎన్నికల ముందువరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. చేవెళ్లలో 2014లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు మళ్లీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.

5) కేసీఆర్ అడ్డాలో..

తెలంగాణలో మెదక్ ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిచిన సీటు. 2014లో సీఎం అయ్యాక ఆయన రిజైన్ చేశారు. ఆ తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి రెండు సార్లు చాన్సిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని నిలిపారు. ఇక ఇక్కడినుంచి బీజేపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిలిచారు. ఈయన గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నీలం మధు గతంలో బీఆర్ఎస్ నాయకుడే.