నాడు తిట్టి-నేడు బాబును వాడేస్తున్నారే!
చంద్రబాబును తిట్టిన నోటితోనే ఇప్పుడు పొగుడుతున్నారు. గతంలో చంద్రబాబు చెప్పలేదా? అంటూ.. పాత విషయాలను ప్రస్తావిస్తున్నారు
By: Tupaki Desk | 18 July 2024 12:30 AM GMTతెలంగాణలో గత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు.. అవసరం ఉన్నా.. లేకున్నా.. తమ పాలనా కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టిపోసిన విషయం తెలిసిందే. టీడీపీ ఎదుగుదల జరిగితే తమకు ఇబ్బందులు తప్పవని గుర్తించిన నాయకులు.. చంద్రబాబును కార్నర్ చేసిన విషయం తెలిసిందే. నాడు కేసీఆర్ నుంచి మంత్రుల వరకు అందరూ చంద్రబాబును టార్గెట్ చేసుకున్న వారే. అలాంటి వారు.. ఇప్పుడు అధికారం పోయే సరికి.. గత స్మృతులు తవ్వి తీస్తున్నారు.
చంద్రబాబును తిట్టిన నోటితోనే ఇప్పుడు పొగుడుతున్నారు. గతంలో చంద్రబాబు చెప్పలేదా? అంటూ.. పాత విషయాలను ప్రస్తావిస్తున్నారు. మరి ఇదేం రాజకీయమో వారికే తెలియాలి. ఇక, తాజాగా జరిగిన పరిణామాలను గమనిస్తే.. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని.. రేవంత్ రెడ్డి సహా మంత్రులు భట్టి విక్రమార్క వంటివారు వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరికి బీఆర్ ఎస్ నుంచి కౌంటర్లు వస్తున్నా.. ఆ స్థాయి సరిపోవడం లేదని అనుకున్నారో.. ఏమో.. ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావన తీసుకువచ్చారు.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో ఆదాయం బాగుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని, ఈ విషయం గుర్తు లేదా అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం రైతు రుణ మాఫీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణమాఫీ ఇచ్చిన రైతుకు రైతు భరోసా ఎందుకివ్వరన్నది .. బీఆర్ఎస్ సంధిస్తున్న ప్రశ్న. అయితే.. ఆర్థిక శాఖను నాశనం చేశారని.. అధికార పక్షం నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని చంద్రబాబు పేరుతో కట్టడి చేస్తుండడం గమనార్హం. మొత్తానికి నాడు వెగటైన చంద్రబాబు.. నేడు.. తీపిగా మారడం విశేషం.