Begin typing your search above and press return to search.

మరో 'ఆరు'తో గులాబీ సారుకు షాక్

కాలపరీక్ష కాకుంటే ఏంటి? ఏ ఆరు అయితే తనకు అధికారాన్ని.. అదృష్టాన్ని తెచ్చి పెట్టిందని గులాబీ సారు కేసీఆర్ బలంగా నమ్మేవారో

By:  Tupaki Desk   |   12 July 2024 5:34 AM GMT
మరో ఆరుతో గులాబీ సారుకు షాక్
X

కాలపరీక్ష కాకుంటే ఏంటి? ఏ ఆరు అయితే తనకు అధికారాన్ని.. అదృష్టాన్ని తెచ్చి పెట్టిందని గులాబీ సారు కేసీఆర్ బలంగా నమ్మేవారో.. ఇప్పుడు అదే ఆరు ఆయనకు ఆగమాగం చేస్తోంది. వరుస షాకులిస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి కాంగ్రెస్ గూటికి వెళ్లగా.. ఆ ఆరు పరేషాన్ నుంచి బయటకు రాకుండానే గులాబీ ఎమ్మెల్సీలు ఆరుగురు గులాబీ కారును.. సారును వదిలేసి హస్తంగూటికి వెళ్లిపోవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా మరో ఆరుతో సారుకు షాకిచ్చే ఏర్పాట్లు జరిగినట్లుగా చెబుతున్నారు. ఈసారి ఆరు షాక్ గ్రేటర్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేల నుంచి ఉంటుందని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక కీలక ఎమ్మెల్సీ పార్టీలో చేరనున్నట్లుగా చెబుతున్నారు. ఈ రోజు (శుక్రవారం) ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనుండగా.. శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పార్టీలో చేరతారని చెబుతున్నారు. మరో కీలక ఎమ్మెల్సీ సైతం కారు దిగేసి.. కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకునేందుకు రెఢీ అవుతున్నట్లు చెబుతున్నారు.

తాజా ఎపిసోడ్ లో హస్తం పార్టీలో చేరే ఎమ్మెల్యేల పేర్లపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే.. వీటి విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా.. ఈ నెల చివరి నాటికి లేదంటే అంతకంటే ముందే కూడా పూర్తి కావొచ్చని చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 24నుంచి బడ్జెట్ సమావేశాలు షురూ కానున్నాయి. ఈ నాటికి గులాబీ పార్టీలోని 26 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటం ద్వారా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలన్నది లక్ష్యమని చెబుతున్నారు. గతంలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి విలీనం చేసిన వైనం తెలిసిందే. తాజాగా అలాంటి సీన్ రిపీట్ కానున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు గులాబీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కాంగ్రెస్ లో చేరే వేళలో గంప గుత్తగా చేరటం చూశాం. ఇందుకు భిన్నంగా ఈసారి డిఫరెంట్ సీన్ కనిపిస్తుందని చెబుతున్నారు. గులాబీ ఎమ్మెల్యేలు విడివిడిగానే కాంగ్రెస్ లో చేరనున్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం.. తాము జట్టుగా పార్టీలో చేరలేమని ముఖ్యమంత్రికి స్పష్టంచేసినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత అంశాలతో పాటు.. మహుర్తాలు.. మంచి రోజులు లాంటివి కూడా కీలక భూమిక పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో ‘ఆరు’ షాక్ కు కేసీఆర్ సారుకు తప్పదంటున్నారు.