Begin typing your search above and press return to search.

అప్పుడు కూడా భయపెట్టే పార్టీలో చేర్చుకున్నారా కేటీఆర్?

తాము చేస్తే నీతి.. ఎదుటోడు చేస్తే అవినీతి అన్నట్లు మాట్లాడటంలో అర్థం లేదు. ఇప్పుడు తెలంగాణలో అలాంటి సీనే కనిపిస్తోంది

By:  Tupaki Desk   |   21 July 2024 11:30 AM GMT
అప్పుడు కూడా భయపెట్టే పార్టీలో చేర్చుకున్నారా కేటీఆర్?
X

తాము చేస్తే నీతి.. ఎదుటోడు చేస్తే అవినీతి అన్నట్లు మాట్లాడటంలో అర్థం లేదు. ఇప్పుడు తెలంగాణలో అలాంటి సీనే కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమితో పదేళ్ల అధికారం చేజారి పోయిన గులాబీ పార్టీ.. రేవంత్ సర్కారు కొలువు తీరిన మూడో రోజునే.. ఆర్నెల్లకు మించి ఆ పార్టీ అధికారంలో ఉండదంటూ ప్రకటనలు చేయటం తెలిసిందే. ప్రభుత్వం కూలిపోతుందంటూ కూల్చే ప్రయత్నాలు ముమ్మరం చేసిన వేళ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ మాటల్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏమిటి?

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను భయపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుస్తున్నారంటూ గవర్నర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టీం. ఈ సందర్భంగా గవర్నర్ రాధాక్రిష్ణన్ కు వినతిపత్రం ఇస్తూ.. న్యాయం చేయాలని కోరారు. భయపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చారన్న వాదనను తెర మీదకు తీసుకొస్తున్న కేటీఆర్ అండ్ కో ఒక సూటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వం ఎన్నికైన రెండు దఫాలు.. విపక్షం నుంచి పోటీ చేసి గెలిచిన వారంతా కారు పార్టీలోకి ఎలా చేరినట్లు?

కాంగ్రెస్ పార్టీలోకి ఈ రోజున భయపెట్టి చేర్చుకుంటే.. అప్పట్లో కారు పార్టీలో కూడా భయపెట్టే చేర్చుకున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు? నిజానికి గవర్నర్ కు తాజాగా వినతిపత్రం అందించిన గులాబీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు.. కేసీఆర్ సర్కారు హయాంలో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి.. కారు పార్టీ తీర్థం పుచ్చుకున్న వారే. వినతిపత్రం ఇస్తూ ఫోటోకు ఫోజు ఇచ్చిన మాగంటి గోపీనాథ్.. వివేకానంద.. మల్లారెడ్డి.. సబితా ఇంద్రారెడ్డితో సహా పలువురు ఈ కోవలోకి చెందిన వారే.

అప్పుడు గుర్తుకు రాని నీతి.. కేటీఆర్ కు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వస్తుంది? నిజానికి రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ.. పాలన చేసేందుకు వీలుగా కొంత కాలం వేచి చూసే ధోరణిని ప్రదర్శించినా.. ఆర్నెల్లలో ప్రభుత్వం పడిపోతుందని ఒకరంటే.. కాదు మూడు నెలల్లోనే ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయంటూ పోటీ ప్రకటనలు చేయకుండా ఉండి ఉంటే.. రేవంత్ ప్రభుత్వం గులాబీ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని తప్పు పట్టేవాళ్లు. ఓవైపు ప్రభుత్వం కూలిపోతుందంటూ అల్టిమేటం ఇచ్చినప్పుడు.. పార్టీలో చేర్చుకోవటానికి మినహా ఉండే అల్టర్ నేట్ ఇంకేం ఉంటుంది? చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అనరు కదా? ఈ చిన్న విషయాన్నికేటీఆర్ అండ్ కో ఎందుకు మర్చిపోతున్నట్లు?