Begin typing your search above and press return to search.

శాసనసభా పక్షం కాంగ్రెస్ లో.. పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం.. బీఆర్ఎస్ కు మహా కష్టం!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఖాతా తెరవలేకపోయిన బీఆర్ఎస్ కు.. భారీ గండం పొంచి ఉంది

By:  Tupaki Desk   |   12 July 2024 11:30 AM GMT
శాసనసభా పక్షం కాంగ్రెస్ లో.. పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం.. బీఆర్ఎస్ కు మహా కష్టం!
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఖాతా తెరవలేకపోయిన బీఆర్ఎస్ కు.. భారీ గండం పొంచి ఉంది. ఆ పార్టీకి అసలు ఏ సభలోనూ ప్రాతినిధ్యం లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అదే జరిగితే.. బీఆర్ఎస్ వ్యవస్థాపన జరిగిన తొలిసారి చట్ట సభల్లో ‘జీరో’గా మిగులుతుంది. చకచకా మారుతున్న పరిణామాలను అధినేత కేసీఆర్ గమనిస్తున్నారో లేదో కానీ.. ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. లేదంటే.. నువ్వు నేర్పిన విద్యనే కేసీఆర్ సారూ.. అంటూ కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ను మింగేసే ప్రమాదం ఉంది.

శాసనభ సభలో ఇలా..

గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు గెలుచుకుంది. ఇందులో ఒక సీటు కంటోన్మెంట్ ను ఉప ఎన్నికలో పోగొట్టుకుంది. ఇక ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. మిగిలింది 31. ఇందులోనూ మరో ఏడుగురు కాంగ్రెస్ లోకి వెళ్లేలా ఉన్నారు. అయితే, సాంకేతికంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 38. వీరిలో మూడింట రెండొంతుల మంది.. అంటే 26 మంది ప్రత్యేక శాసనసభాపక్షంగా ఏర్పడి కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ)లో విలీనం కానున్నారని చెబుతున్నారు. 2018 ఎన్నికల అనంతరం 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్‌ఎస్‌ ఇదే విధానాన్ని అనుసరించింది. కాగా, అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ఈ నెల 24వ తేదీ కల్లా బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం (బీఆర్‌ఎ్‌సఎల్పీ).. సీఎల్పీలో విలీనం అయ్యేలా సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తును ముమ్మ రం చేశారని పేర్కొంటున్నారు. మరోవైపు 26 మంది వెళ్లిపోతే బీఆర్‌ఎస్‌ సభ్యుల సంఖ్య 12కు పడిపోతుంది. ఇది ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నేత హోదాకు కావాల్సిన కనీస సంఖ్య. అదే మరొక్క ఎమ్మెల్యే వెళ్లిపోయినా ఈ రెండు హోదాలు దక్కవు.

ఢిల్లీలో ఇలా..

ఢిల్లీలో గులాబీ పార్టీ ఎంపీలు బీజేపీతో టచ్ లోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఓవైపు ఎమ్మెల్యేలను వారించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ఎంపీలపై బీజేపీ వల వేస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు చేరిక ఖాయమనే కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వీరంతా బీజేపీలో చేరుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

మరి ఆయన సంగతేమిటో..?

బీజేపీ రాజ్య సభ ఎంపీల్లో హెటిరో పార్థసారథి రెడ్డి, దీవకొండ దామోదర్‌రావు, కేఆర్ సురేశ్ రెడ్డి, వద్ధిరాజు రవిచంద్ర ఉన్నారు. వీరిలో దామోదర్ రావు నమస్తే తెలంగాణ మీడియాను నిర్వహిస్తున్నారు. మిగతావారిలో సురేశ్ రెడ్డి ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్. మిగతా ఇద్దరు వ్యాపారులు. మిగతా అందరూ చేరినా దామోదర్ రావు మాత్రం వెళ్తారని చెప్పలేం. అయితే, రాజకీయీల్లో ఏదైనా సాధ్యమే. ఆయన ఒక్కరినీ వదిలేసి మిగతా ముగ్గురినీ బీజేపీ కలిపేసుకుని బీజేపీ పార్లమెంటరీ పార్టీ విలీనం అంటుదేమో? అయితే, ఎంపీలతోనూ కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లిందని అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎంపీల తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.