బీసీలు సవాలు విసురుతున్నారా ?
కేసీయార్ ప్రకటించిన మొదటిజాబితా అభ్యర్ధుల తర్వాత బీఆర్ఎస్ లో పెద్ద గోలవుతోంది.
By: Tupaki Desk | 27 Aug 2023 4:55 AM GMTకేసీయార్ ప్రకటించిన మొదటిజాబితా అభ్యర్ధుల తర్వాత బీఆర్ఎస్ లో పెద్ద గోలవుతోంది. కేసీయార్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితా సామాజికవర్గాల వారీగా న్యాయం జరగలేదని పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కేసీయార్ ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల్లో బీసీలకు 22 మందికి మాత్రమే టికెట్లు వచ్చాయి. జనాభా దామాషా ప్రకారం చూసుకుంటే రెడ్లకు 40 మందికి టికెట్లిచ్చిన కేసీయార్ బీసీలకు మాత్రం ఇవ్వలేదు. రెడ్ల జనాభాకు మించి టికెట్లిచ్చిన కేసీయార్ బీసీల జనాభా దామాషాలో తక్కువసీట్లొచ్చాయి.
బీసీ సంఘాల డిమాండ్ల ప్రకారం సుమారు 40 సీట్లు దక్కాలి. కానీ దక్కిన 22 మంది సీట్లపై బీసీ సంఘాలు మండిపోతున్నాయి. టికెట్లు ఆశించి భంగపడిన చాలామంది నేతలు కేసీయార్ పై మండిపోతున్నారు. పార్టీలోని బీసీ నేతల్లో ఇపుడుదే విషయమై పెద్దఎత్తున చర్చ జరగుతోంది. 54 శాతం జనాభా ఉన్న బీసీలకు కేసీయార్ కావాలనే తక్కువ టికెట్లిచ్చారని అనుకుంటున్నారు. బీసీల్లోని 136 ఉపకులాలను తీసుకుంటే కేవలం 6 ఉపకులాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కింది.
యాదవ, గౌడ, మున్నూరుకాపు, పద్మశాలి, గంగపుత్ర, వంజరి ఉపకులాలకు టికెట్లు కేటాయించటంతో మిగలిన ఉపకాలలకు మండిపోతోంది. టికెట్లు ఆశించి భంగపడ్డ బీసీ నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. తొందరలోనే సీనియర్ నేతలతో ఒక సమావేశం ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో గట్టి బీసీ నేతలను ఇండిపెండెంట్లుగా పోటీచేయించే విషయాన్ని బీసీ సంఘాల నేతలు సీరియస్ గా పరిశీలిస్తున్నారు.
ముదిరాజ్, కురబ, ఆరెకటిక ఉపకులాల సంఘాల నేతలు మండిపోతున్నారు. ఈ మూడు ఉపకులాల్లోని ఉపసంఘాల వాళ్ళు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇపుడు ప్రకటించిన వాళ్ళల్లో కొందరికి టికెట్లను మార్చి తమకు కేటాయించాల్సిందే అని డిమాండ్లు చేస్తున్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఫలితం అనుభవించాల్సుంటుందని హెచ్చరికలుకూడా చేస్తున్నారు. ఉపకులాల సంఘాల నేతలు హెచ్చరికలను కేసీయార్ పట్టించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులకు ఇబ్బందుల తప్పేట్లు లేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.