27న రెండో జాబితా ?
పెండింగ్ లో పెట్టిన రెండోజాబితాను ఈనెల 27వ తేదీన కేసీయార్ ప్రకటించనున్నట్లు సమాచారం.
By: Tupaki Desk | 27 Aug 2023 4:58 AM GMTపెండింగ్ లో పెట్టిన రెండోజాబితాను ఈనెల 27వ తేదీన కేసీయార్ ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణాలోని మొత్తం 119 సీట్లలో ఒకేసారి 115 సీట్లలో అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటిజాబితా ప్రకటించి సుమారు వారంరోజులవుతోంది. అప్పట్లో ఎందుకనో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించకుండా పెండింగ్ ఉంచారు. నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలు పెండింగులో ఉన్నాయి. వాటిపై ఫాం హౌస్ లో కేసీయార్ చేసిన కసరత్తు పూర్తియినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.
అందుబాటులోని సమాచారం ప్రకారం నర్సాపూర్ లో సునీతా లక్ష్మీరెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి, నాంపల్లిలో ఆనందగౌడ్, గోషామహల్ నుండి నందకిషోర్ వ్యాస్ పేర్లు దాదాపు ఖాయమైనట్లేనట. కొంతమందేమో సరైన అభ్యర్ధులు దొరకని కారణంగా నాలుగు నియోజకవర్గాలను అప్పట్లో పెండింగ్ పెట్టారని చెబుతారు. ఇదే సమయంలో సంఖ్యాశాస్త్రం ప్రకారమే కేసీయార్ పెండింగ్ లో ఉంచారంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 సెంటిమెంట్ కేసీయార్ కు బాగా ఎక్కువని అందరికీ తెలిసిందే.
ఈ సెంటిమెంట్ ప్రకారమే 115 నియోజకవర్గాలను ప్రకటించారని అంటారు. నిజానికి పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్ధులను ఫైనల్ చేసేశారని సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇబ్బంది వచ్చిందనే నాలుగింటిని పెండింగులో పెట్టారని టాక్ వినబడుతోంది. అసలుది సెంటిమెంట్ ప్రకారమే ప్రకటించారు కాబట్టి రెండో జాబితాకు సెంటిమెంట్ వర్తించదని కూడా అంటున్నారు. పై నాలుగు నియోజకవర్గాల్లో టికెట్ల కోసం నేతల మధ్య బాగా పోటీ ఉంది.
మొదటిజాబితాలో ప్రకటించిన జాబితాలో చాలామంది విషయంలో పార్టీలో పెద్ద గొడవలు జరుగుతున్నాయి. కనీసం 30 మంది ఎంఎల్ఏ అభ్యర్ధలను మార్చాల్సిందే అని నేతలు, ఆశావహులు పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. అసలే ఎంఎల్ఏల మీద జనాల్లో బాగా వ్యతిరేకతుందని నేతలు మొత్తుకుంటుంటే కేసీయార్ సిట్టింగులకే మళ్ళీ టికెట్లు కేటాయించటాన్ని ఆశావహులు తట్టుకోలేకపోతున్నారు. సిట్టింగుల్లో చాలామంది మీద బీసీ సంఘాల్లోనే ఎక్కువ గోల జరుగుతోంది. తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని కేసీయార్ పై మండిపోతున్నారు కులసంఘాల నేతలు. చివరకు ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.