బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. కేసీఆర్ ఈ రెండు చోట్ల నుంచి పోటీ!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణానికి సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెరదించారు
By: Tupaki Desk | 21 Aug 2023 10:41 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణానికి సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెరదించారు. పండితులు సూచించిన ముహూర్తం మేరకు ఆగస్టు 21న మధ్యాహ్నం 2.30 గంటలు దాటాక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. ఇందుకు శ్రావణ మాసం నాగుల పంచమి తిథి కావడంతో ఈ రోజును అభ్యర్థుల ప్రకటనకు ఎంచుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ తోపాటు కామారెడ్డి నుంచి కూడా ఆయన పోటీ చేస్తారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్థన్ కు తాజాగా ప్రకటించిన జాబితాలో ఎక్కడా సీటు కేటాయించలేదు.
బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు .. హరీష్ రావు సిద్ధిపేట నుంచి, కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేస్తారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నుంచే బరిలోకి దిగుతారు. కాగా తాజాగా హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హన్మంతరావుకు సీటు దక్కింది. ఇక సర్పంచ్ నవ్య వ్యవహారంలో అభాసుపాలైన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు సీటు దక్కలేదు. అలాగే కూతురు పోరుతో రాష్ట్రవ్యాప్తంగా పాపులరైన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా సీటు లభించలేదు. అయితే జనగాంకు కేసీఆర్ ఎవరినీ అభ్యర్థులుగా ప్రకటించలేదు.
అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులూ చేయలేదని, కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. నాలుగు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదు. వీటిలో నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ స్థానాలు ఉన్నాయి. వీటికి త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.
ముందుగా అంతా అనుకున్నట్టే కోరుట్ల, ఉప్పల్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, వేములవాడ సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి (ఉప్పల్), రాజయ్య (స్టేషన్ ఘనపూర్), రాములు నాయక్ (వైరా), రేఖా నాయక్ (ఖానాపూర్), చెన్నమనేని రమేష్ (వేములవాడ), గంప గోవర్ధన్(కామారెడ్డి), రాథోడ్ బాపురావు (బోధ్), విద్యాసాగర్ రావు (కోరుట్ల-అభ్యర్థిగా కుమారుడు) టికెట్లు దక్కలేదు.
కోరుట్లలో విద్యాసాగరరావు తనకు ఆరోగ్యంగా బాగోడం లేదని.. తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరడంతో అక్కడ ఆయన కుమారుడికి సీటు లభించింది.
ఇక మంత్రుల్లో శ్రీనివాస గౌడ్ (మహబూబ్ నగర్), జగదీశ్ రెడ్డి (సూర్యాపేట), ప్రశాంత్ రెడ్డి (బాల్కొండ), ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), గంగుల కమలాకర్ (కరీంనగర్), తలసాని శ్రీనివాసయాదవ్ (సనత్ నగర్), పువ్వాడ అజయ్ (ఖమ్మం), ఎర్రబెల్లి దయాకరరావు (పాలకుర్తి), మల్లారెడ్డి (మేడ్చల్). సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (వనపర్తి)లకు వారి పాత సీట్లే లభించాయి.