కాంగ్రెస్ గూటికి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఒకరు తర్వాత మరొకరు అన్నట్లుగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి విపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు చేరుతున్నారు.
By: Tupaki Desk | 8 April 2024 6:24 AM GMTఒకరు తర్వాత మరొకరు అన్నట్లుగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి విపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు చేరుతున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంట్రావు ఆదివారం సీఎం రేవంత్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు.
ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి తెల్లం చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య.. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఖమ్మం జిల్లా నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తెల్లం గెలుపొందినా కారు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొంటున్నది లేదు.
అధికారికంగా కాంగ్రెస్ లోకి చేరకున్నా.. ఆ పార్టీకి చెందిన కార్యక్రమాల్లో అనధికారికంగా పాల్గొంటున్నారు. చివరకు శనివారం తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభకు హాజరై.. వేదిక మీద కూర్చున్నారు. కాంగ్రెస్ లో చేరతారన్నప్రచారం జరిగినప్పటికీ ఆయన ఆ పని మాత్రం చేయలేదు. తాజాగా ఆ కొరత తీరుస్తూ ముఖ్యమంత్రి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ద్వారా అధికారికంగా కాంగ్రెస్ లోకి చేరినట్లైంది. దీంతో.. బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి చేరినట్లైంది. దీంతో అధికారికంగా గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మూడో ఎమ్మెల్యేగా తెల్లం నిలిచారు.