ఆర్నెల్లు కూడా కాలేదు.. జాబ్ నోటిఫికేషన్ మీద ఇంత రచ్చేంది కేటీఆర్?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి ఇంకా ఆర్నెల్లు పూర్తి కాలేదు.
By: Tupaki Desk | 6 July 2024 5:30 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి ఇంకా ఆర్నెల్లు పూర్తి కాలేదు. ఆ మాటకు వస్తే.. మరింత కరెక్టుగా చెప్పాలంటే ఈ రోజు (జులై 7)కు ఆర్నెల్లు పూర్తి అవుతాయి. ఈ ఏడాది మార్చి 8న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కొద్ది రోజుల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వ్యవస్థను అర్థం చేసుకోవటంతోపాటు.. అప్పటికి పదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ కు భిన్నమైన విధానాలతో ముందుకు వెళ్లాలంటే.. అందుకు తగ్గ టీంను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ప్లాగ్ షిప్ ప్రోగ్రాంల మీద ఫోకస్ చేయటం.. ప్రాధాన్యతను అనుసరించి పలు అంశాల్ని పాలో కావాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలు మంత్రిగా పని చేసిన కేటీఆర్ కు తెలియనది కాదు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరుకు మంత్రిగా ఉన్న కేటీఆర్.. డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరించిన వైనం తెలిసిందే. పదేళ్లు తాము తెలంగాణ రాష్ట్రానికి అధికార పక్షంగా ఉండి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు.. నిరుద్యోగుల ఆకాంక్షల్ని తీర్చేందుకు జాబ్ నోటిఫికేషన్లను వరుస పెట్టి ఇచ్చి ఉంటే.. ఈ రోజుకు నిరుద్యోగ సంస్థ ఇప్పుడున్నం త తీవ్రంగా అయితే ఉండేది కాదు కదా? అదేమీ చేయలేని మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు పై అదే పనిగా విమర్శలు గుప్పించటం చూసినప్పుడు.. ఇంత ఉష్ణం ఏమిటి కేటీఆర్? అన్న సందేహం కలుగక మానదు.
పేరుకు ఆర్నెల్లు ప్రభుత్వాన్ని నడిపినట్లుగా రేవంత్ ను అనొచ్చు. కానీ.. వాస్తవంగా చూస్తే ఆయనకు మూడు నెలలు కూడా సమయం లభించలేదు. ఒకవేళ ఎన్నికల ఎపిసోడ్ లేకుండా ఉండి ఉంటే.. అది మరోలా ఉండేది. సార్వత్రిక ఎన్నికలు సుదీర్ఘంగా సాగటం లాంటి కారణాలతో జాబ్ నోటిఫికేషన్ లు విడుదల ఆలస్యమవుతోంది. ఈ అంశాన్ని చూపిస్తూ కొన్ని సంఘాల వారు గడిచిన కొద్దిరోజులుగా హడావుడి చేయటం తెలిసిందే. వీరికి గొంతు కలిపేందుకు తెగ ఉత్సాహాన్నిప్రదర్శిస్తున్నారు కేటీఆర్.
అయితే.. తన నోటి నుంచి నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ ఏం మాట్లాడినా అది తనకు మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువగా చేస్తుందన్న విషయాన్ని కేటీఆర్ గ్రహిస్తే బాగుంటుందని చెబుతున్నారు. పదేళ్లు పవర్ లో ఉన్నప్పుడు ఇప్పుడు కేటీఆర్ చూపిస్తున్న స్పీడ్ ను ప్రదర్శించి.. వారాల వ్యవధిలోనే జాబ్ రిక్రూట్ మెంట్ విషయాన్ని అప్పట్లోనే కేటీఆర్ తేల్చేసి ఉండొచ్చు కదా? అప్పుడేమో పదేళ్లు పాటు చేయలేని పనిని.. నిండా మూడు నెలలు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి.. అప్పుడే రేవంత్ సర్కారు మీద జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయలేదంటూ ఎటాక్ చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా.. తిరిగి ఆయన మీదే విమర్శల వేళ్లు చూపిస్తాయన్న విషయాన్ని కేటీఆర్ త్వరగా గ్రహిస్తే మంచిది. లేదంటే మరింత అభాసుపాలు కావటం ఖాయం.