ఫిబ్రవరి 19న తండ్రి, 23న కూతురు... బీఆరెస్స్ ఎమ్మెల్యే లాస్య ప్రమాదంలో కొత్త విషయాలు!
కంటోన్మెంట్ బీఆరెస్స్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Feb 2024 5:38 AM GMTకంటోన్మెంట్ బీఆరెస్స్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ప్రమాదానికి సంబంధించి సరికొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... అవుటర్ రింగ్ రోడ్ పై రెయిలింగ్ ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంతా భావించినా అది వాస్తవ కారణం కాదని అంటున్నారు. దానికంటే ముందు లారీని ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.
అవును... ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో సరికొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టిందని.. దీంతో లారీకి కారు ఇరుక్కుపోవడంతో సుమారు 100 మీటర్లు ముందుకు లాక్కునిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం లారీ నుంచి కారు విడిపోయి రెయిలింగ్ ను ఢీకొట్టిందని అంటున్నారు. దీనికి... కారు డ్రైవర్ అతివేగం, నిద్రమత్తే కారణం అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇటీవల ఆమెకు వరుస ప్రమాదాలు!:
అయితే... ఆమెకు ప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదు! ఈమధ్య కాలంలో ఆమె వరుస ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు. ఇందులో భాగంగా... గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం జరిగింది! ఇక ఈ నెల 13న కేసీఆర్ నల్గొండ సభకు హాజరైన ఆమె తిరుగు ప్రయాణంలో ఆమె ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగా... నార్కెట్ పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారును ఆటో ఢీకొట్టింది.
అనంతరం ఆమె కారు ఓ హోంగార్డును ఢీకొట్టడంతో అతడు మరణించాడు! ఈ ప్రమాదంలో లాస్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అది జరిగిన పదిరోజుల లోపే మరోసారి కారూ ప్రమాదం జరగడం.. ఆమె మరణించడం జరిగింది.
ఫిబ్రవరి 19న తండ్రి.. ఫిబ్రవరి 23న కూతురు!:
లాస్య తండ్రి సాయన్న గత ఏడాది ఇదే నెలలో చనిపోయారు. 2023 ఫిబ్రవరి 19న సాయన్న చనిపోతే.. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కూతురు 2024 ఫిబ్రవరి 23న చిన్న వయసులో చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. 1994 నుంచి 2004 వరకూ మూడుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న... 2014లో మరోసారి టీడీపీ నుంచి 2018లో బీఆరెస్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో గత ఎన్నికల్లో తండ్రి పోటీచేసిన స్థానం నుంచి బరిలోకి దిగిన లాస్య... సమీప బీజేపీ అభ్యర్థిపై 17,169 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ నేపథ్యంలో తండ్రి మరణించిన ఏడాది గడవగానే ఆమె రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
లాస్య నందిత రాజకీయ ప్రస్థానం!:
లాస్య నందిత 2015లోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆ ఏడాది జరిగిన కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 2016లో కవాడీగూడ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. తర్వాత 2021లో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో 2023లో తన తండ్రి మరణానంతరం ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ తరుపున పోటీ చేసి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు.