అదే నిజమైతే 35-22= 15.. బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా గల్లంతు
అధికారంలో ఉండగా విపక్ష ఎమ్మెల్యేలు ఒక్కొక్కరినీ కాకుండా.. గుంపుగా చేర్చుకుని పార్టీలను దెబ్బకొట్టారు కేసీఆర్.
By: Tupaki Desk | 13 Jun 2024 11:09 AM GMTమూలిగే నక్కపై తాటిపండు పడడం అంటే ఇదేనేమో? కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముడితే ఇంతేనేమో? సరిగ్గా ఏడాది కిందట కిక్కిరిసి ఉన్న ఆ పార్టీ ఇప్పుడు సగానికి ఖాళీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం.. లోక్ సభ ఎన్నికల్లో చరిత్రలో తొలిసారి ఖాతా కూడా తెరవకపోవడం.. వీటి మధ్యలో అధినేత కుమార్తె జైలుపాలవడం.. ఇలా అన్ని పరిణామాలతో పార్టీ నుంచి పెద్దఎత్తున వలసలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఇంతటితో కథ ముగిసిందా..?
బీజేపీ రెండో పెద్ద పార్టీగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసినట్లేనా? అనే అనుమానం తలెత్తుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకున్న కారు పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు జంప్ అయ్యారు. వీరంతా అధికార కాంగ్రెస్ లో చేరారు. ఇంతలో లోక్ సభ ఎన్నికలు రావడంతో వలసలు ఆగాయి. ఇప్పుడు అవి కూడా పూర్తికావడం, బీఆర్ఎస్ ఘోర ప్రదర్శన చేయడంతో మళ్లీ పార్టీ నుంచి జంపింగ్ లు మొదలు కానున్నట్లు చెబుతున్నారు.
ఒకేసారి అంతమందా..?
కొన్ని విశ్లేషణల ప్రకారం బీఆర్ఎస్ నుంచి ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. కారు
పార్టీలో తమకు భవిష్యత్ ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువమంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కాగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతితో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నెగ్గింది. దీంతో బీఆర్ఎస్ బలం 38 కి తగ్గింది. ముగ్గురు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. అంటే నికరంగా 35 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు.
ప్రతిపక్ష హోదా గల్లంతేనా?
జంపింగ్ లను కూడా కలుపుకొని బీఆర్ఎస్ బలం 38 అనుకున్నా.. 22 మంది పార్టీ మారితే మిగిలేది 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. తెలంగాణ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 119. ప్రతిపక్ష హోదా రావాలంటే ఇందులో పది శాతం ఎమ్మెల్యేలు ఉండాలి. అంటే.. 19. కానీ, బీఆర్ఎస్ కు 16 మంది మాత్రమే మిగులుతున్నారు. దీంతో ముందుగా ప్రతిపక్ష హోదా గల్లంతు కానుంది.
కేసీఆర్ నేర్పిన విద్యనే..
అధికారంలో ఉండగా విపక్ష ఎమ్మెల్యేలు ఒక్కొక్కరినీ కాకుండా.. గుంపుగా చేర్చుకుని పార్టీలను దెబ్బకొట్టారు కేసీఆర్. ఇప్పుడు అదే విధంగా ఆయన పార్టీ నుంచి 22 మంది కాంగ్రెస్ లోకే వెళ్లారనుకుంటే.. బీఆర్ఎస్ శాసనసాభ పక్షం విలీనం అయినట్లే. ఇలా చేస్తే ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఈ దిశగానే కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 2/3 వంతు మంది (దాదాపు 26 మంది) ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామని వీళ్లంతా స్పీకర్ కు లేఖ ఇస్తే, ఆ గ్రూపునే అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తిస్తారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీలకు ఇలాంటి పరిస్థితే వచ్చింది.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే?
బీఆర్ఎస్ నుంచి ఒకేసారి అంతమంది ఎమ్మెల్యేలు జంపింగ్ సాధ్యమా? అనేది ప్రశ్న. ఏమో..? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. సరే 22 మంది కాకున్నా.. కనీసం 11 మంది కాంగ్రెస్ లోకి వెళ్లినా కారు పార్టీకి అది పెద్ద దెబ్బనే.