రేవంత్ పెద్దరికాన్ని పాడుచేసుకుంటున్నారా?
వయసులో చిన్నే అయినా.. రాజకీయంగా పెద్దరికాన్ని తలెకెత్తుకున్న నాయకుడిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 21 Jun 2024 2:30 PM GMTవయసులో చిన్నే అయినా.. రాజకీయంగా పెద్దరికాన్ని తలెకెత్తుకున్న నాయకుడిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాజకీయంగా తీసుకువచ్చిన మార్పులు.. చేసిన వ్యాఖ్యలు కూడా.. ఆయన పరిణితిని ప్రశంసించేలా చేశాయి. ముఖ్యం గా పొరుగు పార్టీల నుంచి గెలిచిన వారిని తన పార్టీలోకి చేర్చుకునే విషయంలో ఆయన ఆచి తూచి నిక్కచ్చిగా మాట్లాడారు. ప్రధానంగా తాను కేసీఆర్ మాదిరిగా పనిచేయబోనని చెప్పారు.
పలు చానెళ్లకు ముఖ్యమంత్రి అయిన కొత్తలో రేవంత్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు బుద్ధిలేదు. అందుకే కాంగ్రెస్ లెజిస్లచర్ పార్టీని రెండు సార్లు తన పార్టీలో విలీనం చేసుకున్నారు. బుద్దున్నోడు ఎవడైనా..తనకు బలం ఉన్నప్పుడు.. ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు. దీంతో రేవంత్ పెద్దరికం మరింత పెరిగింది. రాష్ట్రంలో రాజకీయ కప్పదాట్లు, గోడ జంపింగులు ఉండవని అందరూ ఆశించారు. కానీ, రోజులు గడిచే కొద్దీ.. ఇవి మామూలే అన్నట్టుగా మారాయి.
తాజాగా బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా రేవంత్ తన బృందంలో చేర్చుకున్నారు. వాస్తవానికి ఇప్పటికిప్పుడు రేవంత్‌కు వచ్చిన నష్టం లేదు. ఇలా చేర్చుకోకపోయినా.. ఆయన మెజారిటీ ఏమీ తగ్గదు. కానీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు చెప్పిన మాటను వదిలేసి.. ఇప్పుడు మాత్రం ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆయన తెరదీశారు. ఈ పరిణామమే.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా పార్టీల నుంచి నాయకులను చేర్చుకునే కేసీఆర్ పలుచనయ్యారనేది రేవంత్‌కు కూడా తెలుసు.
తెలిసినా.. ఇప్పుడు ఆయన కూడా.. కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు. ఇక, ఇలా చేర్చుకున్న వారికి రేవంత్ పదవులు ఇవ్వక తప్పదు. పార్టీ మారి వచ్చారంటేనే ఏదో ఒకటి ఆశించి వస్తారు. అయితే..ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు అండగా ఉండి గెలిపించిన వారంతా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి పదువులు ఇవ్వకుండా.. కొత్తగా చేరేవారికి కనుక రేవంత్ పదవులు పందేరం చేస్తే.. అది ఆయన పెద్దరికానికే మచ్చ వచ్చేలా చేస్తుంది. పైగా.. కాంగ్రెస్‌లో కుమ్ములాటలకు కూడా దారి తీస్తుంది. ఎలా చూసుకున్నా.. ఆపరేషన్ ఆకర్ష్ అనేది రేవంత్ వంటి నాయకులకు సరికాదనే వాదన వినిపిస్తోంది.