బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్!
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది.
By: Tupaki Desk | 3 May 2024 10:33 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో చిత్తయిన బీఆర్‌ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. అయితే పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొనడంతో కేసీఆర్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ఇది చాలదన్నట్టు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. లోక్ సభ ఎన్నికల ముంగిట ఆ పార్టీకి ఇది శరాఘాతమేనని అంటున్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. ఫోర్జరీకి పాల్పడటంతో ఆయనను అనర్హుడిగా తేల్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నుంచి దండే విఠల్ 2022లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
దండే విఠల్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు విఠల్ ఎన్నిక చెల్లదని సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఆయనకు రూ.50 వేల జరిమానా సైతం విధించడం హాట్ టాపిక్ గా మారింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్ తరఫున దండే విఠల్ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్‌ఎస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఈ క్రమంలో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడానికి విఠల్ కుట్రపన్నారు. రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్టు విఠల్.. రాజేశ్వర్ రెడ్డి పేరుతో ఫోర్జరీ సంతకం చేశారు. ఆ తర్వాత ఆ ఫోర్జరీ సంతకాలతో రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు రాజేశ్వర్ తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు విఠల్ దరఖాస్తును అందజేశారు.
విఠల్ చేసిన తప్పుడు పనితో రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఆయనకు తెలియకుండానే ఉపసంహరించుకున్నట్టు అయ్యింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న రాజేశ్వర్ రెడ్డి.. విఠల్ తన పేరుతో ఫోర్జరీ సంతకాలు చేశారని.. అందువల్ల అతడి ఎన్నిక చెల్లదని ప్రకటించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాను నామినేషన్ ను ఉససంహరించుకోలేదని, కుట్రపూరితంగా తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి కోర్టుకు నివేదించారు. దీంతో దండే విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. అంతేకాకుండా ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది.