Begin typing your search above and press return to search.

ఇంతకీ ఎంపీపై దాడిచేసింది ఎవరు ?

కత్తితో దాడి జరగ్గానే కేసీయార్ అండ్ కో మాట్లాడుతు ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీయే తమ ఎంపీపై దాడిచేయించినట్లు ఆరోపించారు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 7:10 AM GMT
ఇంతకీ ఎంపీపై దాడిచేసింది ఎవరు ?
X

ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపి కొత్త ప్రభాకరరెడ్డిపై దాడిచేసింది ఎవరు ? అన్నది సస్పెన్సుగా మారింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర రెడ్డి దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉండగా మూడు రోజుల క్రితం ఒక యువకుడు కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. పొత్తికడుపులో బలమైన గాయమైనా ప్రాణాపాయం నుండి ఎంపీ తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసీయూలో ఉండి చికిత్స చేయించుకుంటున్నారు. ఎంపీ ఇపుడు బాగానే ఉన్నారు కానీ ఆయనపై దాడిచేసింది ఎవరనే విషయంలో మాత్రం పార్టీల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి.

కత్తితో దాడి జరగ్గానే కేసీయార్ అండ్ కో మాట్లాడుతు ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీయే తమ ఎంపీపై దాడిచేయించినట్లు ఆరోపించారు. ఎన్నికల ప్రచారసభలో ఉన్న కేసీయార్ బహిరంగసభలోనే కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించారు. అయితే వెంటనే కేసీయార్ ఆరోపణలను తప్పికొట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతు ఎంపీపై దాడిచేయించింది బీజేపీయేనని ఆరోపించారు. లేకపోతే ఓటమి భయంతోనే బీఆర్ఎస్సే సానుభూతి కోసం తమ ఎంపీపైన దాడి చేయించుంటుందని ఘాటుగా ఆరోపించారు.

అంటే రేవంత్ ఆరోపణల ప్రకారం ఎంపీపై బీజేపీ దాడిచేయించుంటుంది లేకపోతే బీఆర్ఎస్సే దాడి చేయించుకునుంటుంది. ఇదే విషయమై బీజేపీ దుబ్బాక ఎంఎల్ఏ, ఎంఎల్ఏ అభ్యర్ధి రఘునందనరావు మాట్లాడుతు కొత్త ప్రభాకరరెడ్డిపై జరిగిన దాడిలో తమకేమి సంబంధమని మండిపడ్డారు. సానుభూతితో ఓట్లు సంపాదించుకుని గెలవాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గొడవల్లోకి తమ పార్టీని లాగవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది.

అదేమిటంటే దాడిచేసిన యువకుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఎంపీపై దాడిచేసిన యువకుడికి రాజకీయ నేపధ్యముందా ? ఎవరు చెబితే దాడిచేశాడు ? దాడివెనుక ఏ పార్టీ హస్తముందని పోలీసులు ఈ పాటికే తెలుసుకునుంటారు. అయినా దాడి వెనుక నిజాన్ని పోలీసులు బయటపెట్టలేదంటే అర్ధమేంటి ? ప్రతిపక్షాల్లో ఎవరైనా దాడి చేయించుంటే ఈ పాటికే దాడి వెనకున్న పార్టీ లేదా నేత విషయాన్ని పోలీసులు బయటపెట్టేసుండేవారే అనటంలో సందేహంలేదు. అయినా ఇంతవరకు బయటపడలేదంటే అర్ధమేంటి ?