ఆనాడు ఇస్తే.. ఈనాడు పుచ్చుకునే ఛాన్స్: బీఆర్ ఎస్ మరిచిపోయిన నిజం!
గౌరవమైనా.. మరేదైనా.. ఇచ్చి-పుచ్చుకోమన్నారు. ఇది వ్యక్తిగతంగానే కాదు.. రాజీకీయాలకు కూడా వర్తిస్తుంది.
By: Tupaki Desk | 16 July 2024 4:22 AM GMTగౌరవమైనా.. మరేదైనా.. ఇచ్చి-పుచ్చుకోమన్నారు. ఇది వ్యక్తిగతంగానే కాదు.. రాజీకీయాలకు కూడా వర్తిస్తుంది. తాజాగా తెలంగాణలో తెరమీదికి వచ్చిన వివాదాన్ని గమనిస్తే.. గతంలో ఏం చేశారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. గతంలో ప్రత్యర్థి పార్టీల నాయకులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు `విలువ` ఇచ్చి.. గౌరవంగా వ్యవహరించి.. ఉంటే..ఇప్పుడు అదే విలువ, అదే గౌరవాన్ని అడిగేందుకు.. పొందేందుకు కూడా అర్హత ఉంటుంది. కానీ, గతంలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ ఎస్ పార్టీ.. ఏనాడూ ప్రతిపక్షాలను గుర్తించిన పరిస్థితి లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేసిందే తప్ప.. వారిని వారుగా చూడలేదు.
అప్పట్లో ఏం జరిగింది?
రైతు బంధు, దళిత బంధు.. వంటి కార్యక్రమాలను అప్పట్లో బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీటిని అమలు చేసే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్న నియోజకవర్గాల్లో వీటిని అమలు చేయలేదు. ఒకవేళ అమలు చేయాల్సి వచ్చినా.. (ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్పని పరిస్థితిలలో) ``వాళ్లకు ఇవ్వమయ్యా..మా వోళ్లే ఇస్తరు. వాళ్లు తినేస్తరు. కమీషన్లు గుంజుకుంటరు`` అని వ్యాఖ్యలు చేశారు. చివరకు ఆయన అనుకున్నట్టుగా పలు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా..వారికి కనీసం గౌరవం ఇవ్వకుండా.. సభలు పెట్టినా(అధికారిక) పిలవకుండా.. ప్రొటోకాల్ పాటించకుండానే వ్యవహరించారు.
ఇప్పుడు వస్తుందా?
ఇక, ఇప్పుడు బీఆర్ ఎస్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సహజంగానే.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేయదు కదా! సో.. గతంలో బీఆర్ ఎస్ పాలనను దిక్సూచిగా తీసుకున్న కాంగ్రెస్ నాయకులు కూడా.. తాము చేయాలని అనుకున్న కార్యక్రమాలను పలు నియోజకవర్గాల్లో తమ ప్రజాప్రతినిధులు లేకపోయినా.. వేరే వారిని పంపించి.. లేదా..ఓడిపోయిన వారిని పంపించి.. పనులు చేయిస్తోంది. దీనినే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. `ప్రొటోకాల్` కూడా పాటించరా? అని ప్రశ్నిస్తోంది. మరి బీఆర్ ఎస్ ఆనాడు.. ఇదే ప్రొటోకాల్ పాటించి ఉంటే..ఇప్పుడు కాంగ్రెస్ పాటించేందుకు.. లేదా బీఆర్ ఎస్ ప్రశ్నించేందుకు అవకాశం ఉండేది. కానీ, బీఆర్ ఎస్ తన హయాంలో చేసిన పనినే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే.. ప్రశ్నించడం.. ఏమేరకు సమంజసమనే ది ప్రశ్న.
అసలు ఏం జరిగింది?
హైదరాబాద్‌లో బొనాల చెక్కుల పంపిణీ చేపట్టారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఎల్బీ నగర్‌లో ఉన్న ఖిల్లా మైసమ్మ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే.. ఇక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కేఎల్ ఆర్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. దీనిని తప్పుబడుతూ.. తన వారిని.. ఎందుకు ఎలో చేయలేదని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దీనినే బీఆర్ ఎస్ నాయకులు కూడా ప్రశ్నించారు. ప్రొటోకాల్‌ను పాటించరా? అని ప్రశ్నించారు. అయితే.. గతంలో బీఆర్ఎస్ దీనిని పాటించకపోవడంతో వివాదం ఇరు పక్షాల మధ్య అగ్గి రాజేసింది.