Begin typing your search above and press return to search.

పెరిగిన గులాబీ గురి.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో 48స్థానాల్లో పోటీ

ఇందులో భాగంగా మొత్తంగా 48 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలన్నది గులాబీ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   23 Dec 2023 4:20 AM GMT
పెరిగిన  గులాబీ గురి.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో 48స్థానాల్లో పోటీ
X

పోయిన చోటే వెతుక్కోవాలన్నది పాత సిద్దాంతం. పోయిన చోట వెతుక్కుంటూనే.. కొత్త చోట్ల కూడా వెతుకులాటతో ఉపయోగం ఉంటుందన్నట్లుగా గులాబీ పార్టీ ఆలోచిస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల వెల్లడైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. తమ చేతిలో ఉన్న అధికారార్ని చేజార్చుకొని.. ఇప్పుడు విపక్షంలో ఉన్న బీఆర్ఎస్.. తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ పరిధిలోని పదహారు ఎంపీ స్థానాలపై గురి పెట్టిన గులాబీ పార్టీ.. మహారాష్ట్రలోనూ ఎంపిక చేసిన ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా మొత్తంగా 48 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలన్నది గులాబీ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి చాటుకోవటం తెలిసిందే. తాము అధికారంలో ఉన్న వేళ అప్పటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆరఎస్ ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చటం తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర మీద పోకస్ చేసిన గులాబీ బాస్ కేసీఆర్.. చాలా తక్కువ వ్యవధిలోనే మహరాష్ట్ర రాజకీయాల్లో పాగా వేయటం షురూ చేశారు.

ఫాంహౌస్ లోని బాత్రూంలో జారి పడిన కేసీఆర్.. తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం జూబ్లీహిల్స్ లోని ఇంట్లో సేద తీరుతున్న సంగతి తెలిసిందే. త్వరగా కోలుకుంటున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర మీద ఫోకస్ చేయటం మరింత పెంచినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్ రావును అక్కడి నేతలతో నిరంతరం టచ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత లాతూరులో పది వేల మందితో సభను నిర్వహించిన బీఆర్ఎస్.. ఈ నెల 30న కొల్హాపూర్ లో బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అనంతరం షోలాపూర్.. ఔరంగాబాద్.. వార్దా.. బీడ్ లోనూ సభలు ఉంటాయని చెబుతున్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర గ్రామ పంచాయితీ ఎన్నికల్లో 200లకు పైగా సర్పంచ్.. వార్డు సభ్యుల పదవుల్ని బీఆర్ఎస్ అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. ఇప్పటికి మహారాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలకు పైగా పార్టీకి క్రియాశీలక సభ్యులుగా నమోదైనట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా 48 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ అండ్ కో ఉన్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ పై సానుభూతిని పెంచేలా చేసిందని చెబుతున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీల్ని ఇచ్చిన కాంగ్రెస్ మోసపూరితంగా అధికారంలోకి వచ్చినట్లుగా మహారాష్ట్ర ప్రజల్లో అభిప్రాయం నెలకొందన్న మాట వినిపిస్తోంది. రైతులను లక్ష్యంగా చేసుకొని రాజకీయాల్ని చేస్తున్న బీఆర్ఎస్.. ీసారి ఎంపీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్న పట్టుదలతో గులాబీ టీం ఉన్నట్లుగా చెబుతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ కోలుకున్న తర్వాత మహారాష్ట్రంలో పర్యటిస్తారన్నమాట బలంగా వినిపిస్తోంది.