మొన్న కేకే, నిన్న కడియం... నేతలెందుకు వలస వెళ్తున్నారు?
ఇటీవల లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి తన కూతురు కావ్య కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుమార్తె కోసం కేశవ రావు సైతం కాంగ్రెస్ లోకి మారారు.
By: Tupaki Desk | 29 March 2024 2:43 PM GMTరాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శత్రువులు కూడా ఉండరు. అవసరాన్ని బట్టి మారుతుంటారు. వారికి లాభం కలుగుతుందంటే చాలు పార్టీ ఫిరాయింపులకు వెనకాడరు. అవి ఏ ఎన్నికలైనా అభ్యర్థుల వైఖరిలో మార్పుండదు. తమ వారసుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడరు. వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళతారు. ఈ విషయంలో ఎవరి మాట పట్టించుకోరు.
కూతుళ్లు, కొడుకుల కోసం పార్టీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి తన కూతురు కావ్య కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుమార్తె కోసం కేశవ రావు సైతం కాంగ్రెస్ లోకి మారారు. ఇంకా కుమారుడి భవిష్యత్ కోసం పోతుగంటి రాములు కూడా జెండా వీడారు. ఇలా వారసుల కోసం తండ్రులు త్యాగాలు చేస్తున్నారు.
వీరంతా ఇలా పార్టీలు మారినా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాత్రం తన కొడుకులకు పట్టుబట్టి మరీ టికెట్లు సాధించుకుంటున్నారు. సొంత పార్టీలోనే కొనసాగుతున్నారు. తన వారసుల్లో ఒకరిని ఎమ్మెల్యే చేశారు. మరొకరికి ఎంపీ సీటు తెచ్చుకున్నారు. వారసులకు కావాల్సినవి సాధించుకునే క్రమంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పనులు సాధించుకోవడం అందరికి సాధ్యం కాదు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. దీంతో పార్టీల్లో ప్రకంపనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో నేతల్లో చాలా మంది కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తుండటంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇదే సంప్రదాయం కొనసాగితే భవిష్యత్ లో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరు మిగలరని అంటున్నారు. దీంతో పార్టీ ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
వారసుల పేరుతో వెళ్తున్నా వారి ఉద్దేశం వేరే ఉంటోంది. బీఆర్ఎస్ లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో బీఆర్ఎస్ నేతల బాగోతాలు బయట పడుతున్నాయి. అందుకే అందరు సర్దుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు.