Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ టీఆర్ఎస్ కానుందా?

చివరకు ఈ కేసులోనే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన వేళలో మాత్రం ఆయన గళం విప్పారు.

By:  Tupaki Desk   |   25 March 2024 5:55 AM GMT
బీఆర్ఎస్ టీఆర్ఎస్ కానుందా?
X

కొన్ని తప్పుల్ని అస్సలు చేయకూడదు. తనకు మించిన విశ్లేషణ శక్తి తెలుగు రాజకీయ రంగంలో మరొకరు లేరన్నట్లుగా తనకు తాను భావించటమే గులాబీ బాస్ కేసీఆర్ పెద్ద తప్పిదంగా చెప్పాలి. తన శక్తిని ఎక్కువగా ఊహించుకున్న ఆయన వేసిన ఎత్తు ఒకటి చిత్తు కావటం.. ఆయనకు ఊహించని ఎదురుదెబ్బలు తగిలేలా చేసిందని చెప్పాలి. తన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు తెలంగాణ ప్రజలు తలూపుతారని.. తనకు ఎదురు చెప్పే ధైర్యం చేయరన్న నమ్మకం కేసీఆర్ లో టన్నుల కొద్దీ ఉండేది. అదే ఆయన్ను రాష్ట్రాన్ని విడిచి పెట్టి కేంద్రానికి వెళ్లేలా చేసింది. కేంద్రంలో పాగా వేసేందుకు వీలుగా పావులు కదిపేలా చేసింది.

ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ. .దానికి బీఆర్ఎస్ అన్న పేరును డిసైడ్ చేయటం తెలిసిందే. టీఆర్ఎస్ సూపర్ హిట్ అయితే.. బీఆర్ఎస్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావించిన కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా షాకిస్తూ.. ఆ ప్రయత్నం డిజాస్టర్ గా మారింది. దీంతో.. దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. తన రాజకీయ జీవితంలో అత్యంత కీలక స్థానాన్ని చూసిన ఆయన.. ఇప్పుడు అందుకు భిన్నంగా దీనావస్థలో ఉన్నారని చెప్పాలి. చివరకు తన కుమార్తె కం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలిక్కర్ స్కాంలో అరెస్టు అయిన వేళ.. ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించలేని పరిస్థితి.

చివరకు ఈ కేసులోనే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన వేళలో మాత్రం ఆయన గళం విప్పారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. తన గారాల పట్టి కవిత అరెస్టు అయి ఈడీ కస్టడీలో ఉంటే.. ఆమెను పలుకరించేందుకు.. పరామర్శించేందుకు ఇప్పటివరకు కేసీఆర్ వెళ్లింది లేదు. ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లుగా ఇంతకాలం ఎన్నిక ఏదైనా.. తమకు సీటు కావాలంటే తమకు సీటు కావాలంటూ డిమాండ్ చేసే నేతలకు బదులుగా.. టికెట్ తీసుకొని పోటీ చేయాలంటూ బతిమిలాడే పరిస్థితి తాజాగా నెలకొంది.

ఏవైపు చూసినా ప్రతికూలతలను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ బాస్ కొత్త ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు ఉన్నంత కాలం అంతా బాగుందని.. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అన్న పేరు మార్చామో అప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయని.. అప్పటివరకు గెలుపు గుర్రంగా ఉన్న పార్టీ ఇప్పుడు ఓటమికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినట్లుగా భావిస్తున్నారు. నిజానికి టీఆర్ఎస్ అన్నంతనే ఉండే భావోద్వేగ అస్త్రం.. బీఆర్ఎస్ పేరుతో మాయమైందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇటీవల పార్టీ నరి్వహిస్తున్న సమావేశాల్లో కింది స్థాయి నాయకుల్లోనూ పార్టీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున సూచనలు వినిపిస్తున్నాయి. మరికొందరు అయితే ఏకంగా అధినేత తీసుకున్న నిర్ణయంతోనే ఇప్పుడున్న దీన స్థితిలోకి వెళ్లినట్లుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ‘‘ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్‌ఎస్ ను.. బీఆర్ఎస్ గా మార్చాలని ఎవరు చెప్పారు? తెలంగాణ ఆత్మగా చెప్పుకొనే పార్టీ పేరును ఎవరినీ అడగకుండా ఎలా మార్చారు? పేరు మార్చడం వల్లే కొంతకాలంగా పార్టీ గ్రాఫ్‌ పడిపోతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కూడా అదే’’ అంటూ మండిపడుతున్న వైనం తరచూ ఎదురవుతోంది.

ఈ నేపథ్యంలో పీఛే ముడ్ మాదిరి మళ్లీ టీఆర్ఎస్ పేరులోకి వెళ్లేందుకు అవసరమైన ప్రొసీజర్ గురించి ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ పేరును మరోసారి మార్చాలంటే చట్టపరంగా ఏం చేయాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు కేసీఆర్ మరో ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న బీఆర్ఎస్ పేరును తెలంగాణ వెలుపుల వాడేందుకు వీలుగా ఉంచేసి.. ఎప్పటిలానే తెలంగాణలో రాజకీయాల కోసం టీఆర్ఎస్ పేరును వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా.. తమకు అచ్చిరాని బీఆర్ఎస్ పేరును వీలైనంత త్వరగా వదిలేసి.. తమకు అధికారాన్ని అప్పజెప్పిన టీఆర్ఎస్ పేరును మరోసారి తమ సొంతం చేసుకోవటంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నట్లు చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి.