కలిసి రావట్లేదు.. బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ గా మార్చేయాలట!
గులాబీ బాస్ కేసీఆర్ గురించి..ఆయనకున్న నమ్మకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 11 Jan 2024 5:22 AM GMTగులాబీ బాస్ కేసీఆర్ గురించి..ఆయనకున్న నమ్మకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆయనపై సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించారు బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నుంచి గులాబీ శ్రేణులు ఇంకా బయటపడలేదన్న వాదనకు తగ్గట్లే ఆయన వ్యాఖ్యలు ఉండటం విశేషం. ఇందులో భాగంగా ఆచరణలో చాలా కష్టమైన ప్రతిపాదనను ఆయన తీసుకొచ్చారు. బీఆర్ఎస్ మార్చిన పార్టీ పేరును మార్చేయాలని.. టీఆర్ఎస్ గా మార్చాలని ఆయన చెబుతున్నారు.
త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సన్నాహాక సమావేశాల్ని నిర్వహిస్తున్న వేళ.. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశాలకు వస్తున్న పార్టీ నేతల్లో అత్యధికులు పార్టీ పేరును మార్చాలని.. తిరిగి టీఆర్ఎస్ పేరును పార్టీకి పెట్టాలని కోరుతున్నట్లుగా చెప్పారు. గురువారం వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలోనూ ఈ డిమాండ్ ను తెర మీదకు తీసుకురావటం గమనార్హం.
తెలంగాణ పార్టీగా ప్రజల్లో బలమైన గుర్తింపు ఉన్న వేళ.. పార్టీ పేరులో తెలంగాణను తొలగించి.. భారత్ను చేర్చటం వల్ల తెలంగాణ సెంటిమెంట్ పై ప్రభావం చూపుతోందన్నారు. బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లో ఏర్పడుతోందని పేర్కొన్నారు. తాను చెప్పిన భావన ఒకట్రెండు శాతం ప్రజల్లో కలిగిగినా.. ఆ మేరకు ఓట్లు దూరమవుతాయన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉందని.. బీఆర్ఎస్ గా మారిన తర్వాత అంతగా కలిసి రాలేదనే భావన కూడా పార్టీలో ఉందని వ్యాఖ్యానించారు.
పార్టీకి వరమైన తెలంగాణ సెంటిమెంట్ ను దూరం చేసుకోవద్దని.. తిరిగి టీఆర్ఎస్ గా మారిస్తే బాగుంటుందన్న ఆయన.. ‘తాను చెబుతున్నది మెజార్టీ కార్యకర్తలు.. ప్రజల అభిప్రాయం’ అన్న కడియం పార్టీకి రెండు పేర్లను పెట్టే కొత్త ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ‘జాతీయ స్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలనుకుంటే అలాగే ఉంచి.. రాష్ట్ర రాజకీయాలకు టీఆర్ఎస్ ను తెర మీదకు తీసుకొచ్చే అంశాన్ని ఆలోచించాలి. ఇందులో న్యాయపరమైన అంశాలు ఏమైనా ఉంటే.. మాజీ ఎంపీ వినోద్ కుమార్ లాంటి వారు కసరత్తు చేయాలి’ అంటూ కడియం వ్యాఖ్యానించారు. ప్రైవేటు సంభాషణల్లో తప్పించి.. పబ్లిక్ గా ఇలాంటి మాటలు రాని తీరుకు భిన్నంగా.. పార్టీ వేదిక మీద కడియం వినిపించిన వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. ఈ ప్రతిపాదనపై గులాబీ బిగ్ బాస్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.