Begin typing your search above and press return to search.

కొత్త టెన్షన్... పది గుర్తులపై ఫిర్యాదు చేసిన బీఆరెస్స్!

అవును... ఇప్పుడు బీఆరెస్స్ కు కొత్త సమస్య వచ్చి పడింది. కారును పోలిన గుర్తులతో కొత్త తలనొప్పి మెుదలైందని ఎన్నికల కమిషన్ ను కలిసింది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 8:41 AM GMT
కొత్త టెన్షన్... పది గుర్తులపై ఫిర్యాదు చేసిన బీఆరెస్స్!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆరెస్స్ కు అసంతృప్తులు, జంపింగ్ నేతలతో కంటే ఎక్కువగా మరో సమస్య ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... కొన్ని గుర్తులతో వారికి పెద్ద తలనొప్పి అవుతుందని చెబుతున్నారు. దీంతో... ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించింది అధికార పార్టీ

అవును... ఇప్పుడు బీఆరెస్స్ కు కొత్త సమస్య వచ్చి పడింది. కారును పోలిన గుర్తులతో కొత్త తలనొప్పి మెుదలైందని ఎన్నికల కమిషన్ ను కలిసింది. అటువంటి చిహ్నాలను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ కుమార్‌, ఎంపీలు వెంకటేష్‌ నేత, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు ఈసీని కలిశారు.

ఈ సందర్భంగా... తెలంగాణలో "యుగ తులసి పార్టీ"కి రోడ్ రోలర్ గుర్తును కేటాయించడంపై బీఆరెస్స్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారు, రోడ్ రోలర్ గుర్తులు ఈవీఎంలలో దాదాపు ఒకే రకంగా కనిపిస్తాయని.. ఫలితంగా కొంతమంది ఓటర్లు, ప్రత్యేకించి గ్రామీణ నేపథ్యం ఉన్న వృద్ధులు, దృష్టిలోపం ఉన్నవారు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు.

ఇదే సమయంలో రోడ్ రోలర్ తో పాటు ట్రాక్టర్, ఆటోరిక్షా, చపాతీ మేకర్, సోప్ బాక్స్, టీవీ, కుట్టుమిషన్, ఓడ, డోలీ, కెమెరా తదితర గుర్తులు కూడా ఈవీఎంలలో కారు గుర్తును పోలి ఉంటాయని.. ఫలితంగా ఏ గుర్తు ఏమిటో తెలుసుకునే విషయంలో ఓటర్లు కన్ ఫ్యూజన్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఈ అంశంపై మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కంప్లైంట్ చేసిన అంశాన్ని తాజాగా గుర్తుచేసిన బీఆరెస్స్ నేతలు... గతంలో జరిగిన ఎన్నికల్లో.. రోడ్డు రోలర్ గుర్తుకు జాతీయ పార్టీలకంటే ఎక్కువ ఓట్లు పడిన విషయాన్ని ప్రస్థావించారు! ఇదే సమయంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ.. కారును పోలిన గుర్తులతో పలు నియోజకవర్గాల్లో ఓడిపోయినట్లు తెలిపారు.

ఇదే సమయంలో 2019 లోక్‌ సభ ఎన్నికల్లోనూ సమస్య పునరావృతమైందని వివరించారు. ఈ సమస్యలను, తమ ఆందోళలను అర్ధం చేసుకోవాలని కోరిన బీఆరెస్స్ నేతలు... రోడ్డు రోలర్ గుర్తుపై తాము లేవనెత్తిన అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని, రెండు వారాల వ్యవధిలో తుది ఉత్తర్వులను ఇవ్వాలని కోరారు. మరి ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ఎలా రి యాక్ట్ అవుతాదనేది ఆసక్తిగా మారింది.