Begin typing your search above and press return to search.

కారుకు ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా.. తొలినుంచి ఏకైకమే

ఉమ్మడి ఏపీలోనే ఆ జిల్లా చాలా ప్రత్యేకం. ఎక్కడెక్కడినుంచో నాయకులు అక్కడికి వచ్చి గెలుపొందేవారు.

By:  Tupaki Desk   |   8 April 2024 2:30 PM GMT
కారుకు ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా.. తొలినుంచి ఏకైకమే
X

ఉమ్మడి ఏపీలోనే ఆ జిల్లా చాలా ప్రత్యేకం. ఎక్కడెక్కడినుంచో నాయకులు అక్కడికి వచ్చి గెలుపొందేవారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్నా.. అక్కడ ప్రభావం తక్కువగానే ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగతాచోట్ల బీఆర్ఎస్ హవా సాగుతుంటే, ఆ జిల్లాలో మాత్రం ఇతర పార్టీలదే పైచేయి అయింది. ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్కరూ లేని జిల్లాగా మిగిలింది.

నాడు నేడు ఏకైకమే

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 2014లో బీఆర్ఎస్ తరఫున ఒక్కరే ఎమ్మెల్యేగా (కొత్తగూడెంలో జలగం వెంకట్రావు) గెలుపొందారు. అయితే, తదనంతర పరిణామాల్లో వైసీపీ నుంచి ముగ్గురు బీఆర్ఎస్ లో చేరారు. అప్పట్లో ఎంపీగా ఉన్న ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కారు ఎక్కారు. 2016లో బీఆర్ఎస్ నుంచి పాలేరు ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇక ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఒక్క స్థానానికే (ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్) పరిమితం అయింది. ఇటీవలి ఎన్నికల్లోనూ ఒక్క సీటు (భద్రాచలంలో తెల్లం వెంకట్రావ్)తోనే సరిపెట్టుకుంది. అంటే వరుసగా మూడోసారీ బీఆర్ఎస్ కు దక్కింది ఒక్కస్థానమే అన్నమాట.

కాంగ్రెస్ అడ్డా.. కమ్యూనిస్టుల గడ్డ

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డా. కమ్యూనిస్టుల గడ్డ. అందుకే బీఆర్ఎస్ ను నిలువరిస్తోంది. ఇక తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ లోకే చేరడంతో ఉమ్మడి ఖమ్మంలో కారు పార్టీకి ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా లేనట్లైంది. అంతేకాదు.. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఖమ్మమే కావడం గమనార్హం.

పాలమూరు నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఒక్కరైనా ఎమ్మెల్యే ఉన్నారు. ఖమ్మంలో మాత్రమే జీరో అన్నమాట. దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్నపార్టీకి ఇది విచిత్రమైన పరిస్థితే కదూ..?