కారు కాదు.. అప్పట్లో కేసీఆర్ గుర్తు ''బస్సు''
సారు.. ''కారు..'' సర్కారు.. ఇదీ తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నేతల మాట. ఇందులో సారు అంటే కేసీఆర్. కారు అంటే వారి పార్టీ గుర్తు
By: Tupaki Desk | 18 Oct 2023 11:30 PM GMTసారు.. ''కారు..'' సర్కారు.. ఇదీ తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నేతల మాట. ఇందులో సారు అంటే కేసీఆర్. కారు అంటే వారి పార్టీ గుర్తు. సర్కారు అంటే ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని అర్థం. ఇక టీడీపీ సైకిల్ తర్వాత వాహనం (కారు) గుర్తుగా ఉన్న ప్రధాన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సమితిగా 2001లో ఏర్పాటైన ఆ పార్టీ 2022లో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. మరోవైపు రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చి.. హ్యాట్రిక్ పై గురిపెట్టింది.
బస్సు నుంచి కారు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. స్వగ్రామం చింతమడక సింగిల్ విండో చైర్మన్ గా మొదలైన ఆయన ప్రయాణం తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన, రెండు సార్లు సీఎం అయ్యేవరకు సాగింది. ఈ క్రమంలో 1983లో ఓడినా.. 1985 తొలిసారి సిద్దిపేట నుంచి కేసీఆర్ ఎమ్మెల్యే గా గెలిచారు. అప్రతిహతంగా 2004 వరకు విజయ ఢంకా మోగించారు. ఇందులో 2001 ఉప ఎన్నిక కూడా ఉంది.
రవాణా శాఖ మంత్రిగా
1995లో టీడీపీ సంక్షోభంలో పడినపుడు కేసీఆర్.. చంద్రబాబు వెంట నడిచారు. రవాణా శాఖ మంత్రి అయ్యారు. ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రమంతటా పర్యటించారని చెబుతారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొంటుంటారు. కాగా, 1999లో టీడీపీ వరుసగా రెండో సారి గెలిచినప్పటికీ చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్ కు స్థానం లభించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి పొందినా అయిష్టంగానే రెండేళ్లు కొనసాగారు. ఈ క్రమంలో 2000 సంవత్సరంలో విద్యుత్తు చార్జీల పెంపును నిరసించారు. 2001లో టీడీపీ నుంచి బయటకు వచ్చి ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ను స్థాపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నాడు జరిగిన ఉప ఎన్నికల్లో 60 వేలపైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. కాగా, ఉద్యమ పార్టీగా, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా ఇప్పుడు బీఆర్ఎస్ కారు గుర్తు ఎంతో పాపులర్. అయితే, 2001లో మాత్రం కేసీఆర్ సిద్దిపేట ఉప ఎన్నికలో కారు గుర్తుపై పోటీ చేయలేదు. కొత్తగా పార్టీని ప్రారంభించిన నేపథ్యంలో టీఆర్ఎస్ కు నాడు బస్సు గుర్తును తాత్కాలికంగా కేటాయించారు. ఆ గుర్తుపైనే కేసీఆర్ పోటీకి దిగి విజయదుందుభి మోగించారు. కొన్నాళ్లకు టీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం కారు గుర్తును కేటాయించింది. అదే 20ఏళ్లుగా నిలిచిపోయింది.
రూ.30 కోట్ల ఖర్చు..
ఇప్పటి ఎన్నికల్లో నియోజకవర్గంలో రూ.30 కోట్ల ఖర్చు అంటే పెద్ద లెక్కేమీ కాదు. కానీ, 2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికలో మాత్రం చాలా పెద్ద మొత్తమే. తనను ఓడించేందుకు అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. రూ.30 కోట్లు ఖర్చుపెట్టారని స్వయంగా నాడు కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం.
కొసమెరుపు: ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో కారు గుర్తును పోలిన బుల్డోజర్ తదితర గుర్తులు తమ విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయని బీఆర్ఎస్ నాయకత్వం వాపోతోంది. ఆ గుర్తులను అనుమతించవద్దని ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. అయితే, కారు గుర్తుకు బదులు.. కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన బస్సు గుర్తునే ఉంచుకుంటే ఈ ఇబ్బందులు తప్పేవి కదా...?