బీఆర్ ఎస్‌కు సెగ పెడుతున్న `గుర్తులు`
కారు గుర్తును పోలి ఉన్న వాటిని ఇతర అభ్యర్థులకు కేటాయించరాదంటూ.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్లకు ముందు, తర్వాత కూడా.. కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు.
By: Tupaki Desk | 17 Nov 2023 8:25 AM GMTపలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు.. అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు సెగ పెడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్న బీఆర్ ఎస్.. కారు గుర్తును చూసి వారు ఓటేస్తారని భావిస్తున్న విషయం తెలిసిందే. సహజంగా ఎన్నికల్లో వృద్ధులు, నిరక్షరాస్యులు.. కూడా ఇదే పంథాను ఎంచుకుంటారు. గుర్తును బట్టి ఓటేస్తారు. అక్కడ ఎవరి పేరు ఉంది..? ఎవరు పోటీ చేస్తున్నారు? ఇది ఏ పార్టీ? అనే విషయాలను వారు పట్టించుకోరు.
దీంతో ఎన్నికల్లో ఆయా పార్టీలు గుర్తులపైనే ప్రాణం పెట్టుకుంటాయి. ఇక, తాజాగా జరుగుతున్న తెలంగా ణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కారు గుర్తుకు పోటీగా ఉన్న కొన్ని గుర్తులు.. ఆ పార్టీ నేతలను తికమక పెడుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన వాటిలో ప్రధానంగా రోడ్డు రోల ర్, చపాతీ కర్ర గుర్తులు కారు గుర్తును పోలి ఉన్నాయి. దీంతో ఈ గుర్తులను చూసి.. తమ ఓటర్లు ఎక్కడ తికమకపడతారో.. ఎక్కడ తమ ఓటు బ్యాంకు గల్లంతవుతుందోనని.. బీఆర్ ఎస్ నాయకులు తల్లడిల్లుతున్నారు.
పోరాటం చేస్తున్నా..
కారు గుర్తును పోలి ఉన్న వాటిని ఇతర అభ్యర్థులకు కేటాయించరాదంటూ.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్లకు ముందు, తర్వాత కూడా.. కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ పరిణామం తమ పార్టీ అభ్యర్థులకు నష్టం కలిగిస్తోందని చెబుతున్నారు. అయితే.. ఈ వాదనను ఎన్నికల సంఘం కొట్టేసింది. దీనిపై న్యాయపోరాటం కూడా చేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులను ఇతరులకు కేటాయించకుండా చూడాలన్నారు. కానీ, దీనిని సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. దీంతో బీఆర్ ఎస్ అభ్యర్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.