Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు అదే అస్త్రం!

ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి.

By:  Tupaki Desk   |   20 July 2024 10:30 AM GMT
అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు అదే అస్త్రం!
X

ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ స‌మావేశాల సంద‌ర్భంగా అధికార కాంగ్రెస్‌ను ఏ పాయింట్ మీద ఇర‌కాటంలో పెట్టాల‌న్న‌ది బీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పిగా మారింద‌నే చెప్పాలి. సీఎం రేవంత్ ఎప్ప‌టిక‌ప్పుడూ బీఆర్ఎస్ కౌంట‌ర్ల‌కు అడ్డుక‌ట్ట వేస్తుండ‌టంతో ఆ పార్టీకి ప్ర‌శ్నించేందుకు ఓ టాపిక్ దొర‌క‌ని ప‌రిస్థితి త‌లెత్తింది. దీంతో పార్టీ ఫిరాయింపుల‌నే ప్ర‌ధాన అస్త్రంగా చేసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలిసింది.

ఇన్ని రోజులూ రుణ‌మాఫీ గురించి ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ ప్ర‌శ్నించింది. కానీ ఇప్పుడు అసెంబ్లీ స‌మావేశాల ఆరంభాని కంటే ముందే రేవంత్ స‌ర్కారు రుణ‌మాఫీ ప్ర‌క్రియ‌ను ప్రారంభించి బీఆర్ఎస్‌ను దెబ్బ‌కొట్టింది. ఇక నిరుద్యోగుల ఆందోళ‌న గురించి బీఆర్ఎస్ ప్ర‌స్తావించాల‌నుకుంది. కానీ మ‌రో డీఎస్సీ వేస్తామ‌ని చెప్పి డీఎస్సీ అభ్య‌ర్థుల‌ను రేవంత్ స‌ర్కారు శాంతింప‌జేసింది. గ్రూప్‌-2ను వాయిదా వేయ‌డంతో పాటు పోస్టుల పెంపుపైనా చ‌ర్చిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

ఈ నేప‌థ్యంలో స‌భ‌లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్‌కు పెద్ద‌గా పాయింట్లు దొర‌క‌డం లేదు. అందుకే పార్టీ ఫిరాయింపుల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావించ‌నుంద‌ని స‌మాచారం. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌పున గెలిచిన వాళ్ల‌లో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. ఈ విష‌యంపై బీఆర్ఎస్ చ‌ర్చించే ఆస్కార‌ముంది. అయితే గ‌తంలో ఫిరాయింపుల‌పై ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి ప్ర‌శ్న‌లు ఎదుర్కొన్న బీఆర్ఎస్‌.. ఇప్పుడు అదే అంశంపై ప్ర‌శ్నించ‌బోతుండ‌టం కాస్త విడ్డూర‌మే. మ‌రోవైపు నిరుద్యోగ భృతి స‌హా పెండింగ్‌లో ఉన్న హామీల గురించి కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ ప్ర‌శ్నించే అవ‌కాశ‌ముంది.