ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ నా!
ఎలా అంటే 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుని సాధించిన బీజేపీ ఈసారి మాత్రం 8 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి గెలిపించుకుంది.
By: Tupaki Desk | 9 Dec 2023 3:58 PM GMTతెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక మిగిలింది పార్లమెంట్ ఎన్నికలు దీని మీద అన్ని రాజకీయ పక్షాలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇటీవల జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ గరిష్టంగా లాభపడింది. ఏకంగా బీఆర్ఎస్ నుంచి అధికారాన్ని గుంజుకుంది. పదేళ్ల పాటు అప్రతిహతంగా సాగిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి కాంగ్రెస్ సింహాసనం అందుకుంది.
ఇక బీజేపీ కూడా తన స్థాయిలో లాభపడింది. ఎలా అంటే 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుని సాధించిన బీజేపీ ఈసారి మాత్రం 8 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి గెలిపించుకుంది. అలాగే పదహారు శాతం ఓట్ల షేర్ ని సాధించింది. ఇక 16 నుంచి 18 చోట్ల రెండవ స్థానంలో నిలిచింది. 49 చోట్ల డిపాజిట్లు సంపాదించుకుంది. అంటే గత ఎన్నికల్లో వంద చోట్ల డిపాజిట్లు పోగొట్టుకున్న బీజేపీ ఈసారి దాన్ని సగానికి సగం తగ్గించుకుంది అన్న మాట.
దాంతో బీజేపీకి ఎంపీ ఎన్నికల మీద ఒక్కసారిగా ఆశలు పెరిగాయని అంటున్నారు. 2018లో ఓడిన బీజేపీని 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు ఆదరించారు నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారు. ఇపుడు అంతకంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎలా అంటే ఒక్క ఎమ్మెల్యే సీటు ఉంటేనే నాలుగు ఎంపీలు వచ్చాయి. ఇపుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా ఉత్తర తెలంగాణాలో బలం పెరిగింది, హైదరాబాద్ లో పటిష్టంగా ఉన్నామని బీజేపీ లెక్క వేసుకుంటోంది.
దీంతో ఇపుడు బీజేపీ ఎంపీ ఎన్నికల్లో తమకూ కాంగ్రెస్ కి మధ్యనే పోటీ అంటోంది. మోడీ వేవ్ బలంగా వీస్తుందని దాంతో కచ్చితంగా మెజారిటీ సీట్లు సాధిస్తామని ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్ చెబుతున్నారు. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీఆర్ఎస్ కి అన్నీ తానే అయిన కేసీఆర్ ఇపుడు ఆపరేషన్ చేసుకుని ఏకంగా ఎనిమిది నుంచి పది వారాల పాటు రెస్ట్ తీసుకునేలా ఉన్నారు.
బీఆర్ఎస్ కి కేసీఆర్ కంటే పెద్ద స్టార్ కాంపెనియర్ లేడు. ఆయనతోనే పార్టీ ఉంది. తెలంగాణా సమాజం కూడా ఆయన మాటలనే వింటుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా బీఆర్ఎస్ కి 39 దాకా ఎమ్మెల్యే సీటు వచ్చాయి అంటే అది కేసీఆర్ మీద అభిమానమే అంటున్నారు. అలాంటి కేసీఆర్ రెస్ట్ తీసుకుంటే బీఆర్ఎస్ ని కదిలించేది ఎవరు అన్న చర్చ వస్తోంది
మరోవైపు చూస్తే ఎన్నికల్లో ఓడాక కేటీఆర్ హరీష్ రావు కవిత కొంచెం వీక్ అయ్యారు అని అంటున్నారు గతంలో పార్టీకి గట్టి నేతలుగా దూకుడు మీద ఉండే వీరు ఇపుడు సైలెంట్ గా ఉంటున్నారు అని అంటున్నారు. ఇక ఎంపీ ఎన్నికలు అంటే ఆ రాజకీయ వ్యూహాలు వేరేగా ఉంటాయి.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం మీద జనాభిప్రాయం తో జరిగే ఎన్నికలు అటు మోడీ ఇటు రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ సమాజం మీద ప్రజల మీద వారి గురించే చర్చ ఉంటుంది. ఆ ఇద్దరు జాతీయ నేతలతో పోటీకి రావాలీ జనంలో నలగాలీ అంటే కేసీఆర్ మాత్రమే ప్రచారంలో ఉండాలి అని అంటున్నారు. బీఆర్ ఎస్ కి అది సాధ్యపడకపోయినా కేసీఆర్ గతంలో మాదిరిగా ప్రచారం చేయలేకపోయినా పెద్ద దెబ్బ పడుతుంది అని అంటున్నారు.
ఇక ఎంపీ ఎన్నికలను జనాలు చూసే దృష్టి కోణం వేరు. పైగా మోడీ వేవ్ ఉందని ఉత్తరాదిన ఆ పార్టీ గెలిచిన మూడు రాష్ట్రాలు రుజువు చేశాయి. దాంతో మోడీ గట్టిగా ప్రచారం చేస్తారు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి ఇజ్జత్ కా సవాల్ కాబట్టి ఆయన కూడా అగ్రెసివ్ మోడ్ లో జనంలో ఉంటారు. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ ల మధ్య పోరు ముఖాముఖీగా సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే అపుడు బీఆర్ఎస్ మూడవ ప్లేస్ కి వెళ్లి వెనకబడిపోయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.