Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై సంతోష్ రివేంజ్ తీర్చుకుంటున్నారా?

ఈ సమయంలో తాజాగా బీఆరెస్స్ అధినేత కేసీఆర్ పరిస్థితి చూసిన వారు పైన చెప్పుకున్న వాక్యం మరోసారి నిజమైందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   13 July 2024 3:30 AM GMT
కేసీఆర్  పై సంతోష్  రివేంజ్  తీర్చుకుంటున్నారా?
X

భూమి గుండ్రంగా ఉంటుంది అనేది ఎంత నిజమో.. మనం చేసిన పనులకు ప్రతిఫలాలు కూడా అలాగే చుట్టు తిరిగి వస్తాయనేది అంతే నిజమని అంటుంటారు పెద్దలు! ఇది నిజమని చెప్పే ఎన్నో సంఘటనలు ప్రధానంగా రాజకీయాల్లో జరుగుతుంటాయి. ఈ సమయంలో తాజాగా బీఆరెస్స్ అధినేత కేసీఆర్ పరిస్థితి చూసిన వారు పైన చెప్పుకున్న వాక్యం మరోసారి నిజమైందని అంటున్నారు.

అవును... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు బీఆరెస్స్ అధినేత కేసీఆర్. దీంతో ఆయన భూమిపై నడవడం మానేశారు.. భూమికి ఓ అడుగు ఎత్తులో నడుస్తున్నారనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించేవి. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలింది. ఇక ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల సంగతి చెప్పేపనే లేదు.

పైగా... కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇటీవల ఏకంగా ఆరుగురు బీఆరెస్స్ ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇక కీలక నేతలు, మాజీ ఎంపీలు ఇలా వారూ వీరూ అనే తేడాలేమీ లేకుండా వరుసగా కారు దిగిపోతున్నారు. రేవంత్ కూడా వారికి గ్రాండ్ గా వెల్ కం చెబుతున్నారు.

మరోపక్క మరో రెండు రోజుల్లో ఇంకో ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆరెస్స్ ను వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని.. అనంతరం మరో పదిహేను రోజుల్లో బీఆరెస్స్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటామని బీఆరెస్స్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ బాంబు పేల్చారు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో జతకడితే తప్ప బీఆరెస్స్ కు మనుగడలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ ప్రయత్నంలో భాగంగానే హరీష్ రావు, కేటీఆర్ లు హస్తినలో చక్కర్లు కొడుతున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు పూర్తి అడ్డుగోడగా నిలబడుతున్నారంట బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన బీఎల్ సంతోష్. దానికి చాలా బలమైన కారణమే ఉందనేది చాలా మందికి తెలిసిన విషయమే. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఎల్ సంతోష్ ని టచ్ చేశారు!

ఇందులో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేయించేందుకు శతవిధాలా ప్రయత్నించారు! అయితే సంతోష్ కోర్టుకు వెళ్లి అరెస్ట్ కాకుండా జాగ్రత్త పడ్డారు! అటు బీజేపీలోనూ, ఇటు ఆరెస్సెస్ లోనూ బీఎల్ సంతోష్ కీలకమైన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. అయితే... తమ ఎమ్మెల్యేలను కొనడంలో ఆయనదే ప్రధాన పాత్ర అని కేసీఆర్ నాడు బలంగా ఆరోపించారు.

అయితే మొదట్లో చెప్పుకున్నట్లు భూమి గుండ్రంగా ఉంది! ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి దారుణంగా మారిపోయింది! ఈ సమయంలో బీజేపీతో కలిస్తే తప్ప బీఆరెస్స్ కు మనుగడలేదనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో... బీజేపీతో దోస్తీకి ప్రయత్నాలు చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... సరిగ్గా బీజేపీకి – బీఆరెస్స్ కు మధ్య జీఎల్ సంతోష్ అడ్డు గోడలా నిలబడ్డారని.. ఈ పొత్తుకు ససేమిరా అంటున్నారని తెలుస్తోంది.

పైగా... దక్షిణాదిలో సంతోష్ ని కాదని బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకొనే అవకాశం లేదనే టాక్ నడుస్తోంది. దీంతో... భూమి గుండ్రంగా ఉందని... నాడు కేసీఆర్ చేసిన పనే, నేడు ఆయనకు శాపంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. మరి బీఆరెస్స్ కోరికగా చెబుతున్న బీజేపీతో దోస్తీ నెరవేరుతుందా.. లేక, సంతోష్ పంతంగా చెబుతున్న విషయమే నెరవేరుతుందా అనేది వేచి చూడాలి!!