బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం..
ఈ రోజు తెల్లవారు జామున.. సింకింద్రాబాద్ నుంచి సదాశివ పేటకు వెళ్తున్న సమయంలో ఓఆర్ ఆర్ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది.
By: Tupaki Desk | 23 Feb 2024 4:07 AM GMTతెలంగాణ ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్రసమితి.. యువ ఎమ్మెల్యే, కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత దుర్మరణం చెందారు. ఈ రోజు తెల్లవారు జామున.. సింకింద్రాబాద్ నుంచి సదాశివ పేటకు వెళ్తున్న సమయంలో ఓఆర్ ఆర్ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో డ్రైవర్ సహా.. ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు.
ఏం జరిగింది?
సికింద్రాబాద్‌లోని తన ఇంటి నుంచి సదాశివపేటకు వెళ్లేందుకు ఈ రోజు ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే లాస్య నందిత బయలు దేరారు. ఓఆర్ ఆర్ రహదారి మీదుగా ఆమె కారు ప్రయాణిస్తోంది. అయితే.. షెడ్యూల్ ప్రకారం.. 8 గంటలకే సదాశివ పేటకు చేరుకోవాల్సి ఉన్న నేపథ్యంలో డ్రైవర్ అత్యంత వేగంగా కారును నడిపినట్టు తెలుస్తోంది. అయితే.. ఓఆర్ ఆర్‌పై దట్టమైన పొగమంచు కమ్ముకుపోయింది. అయినా కూడా.. డ్రైవర్.. కారును వేగంగానే నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఓ వాహనాన్ని తప్పించబోయి.. సడెన్‌బ్రేకులు వేయడంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు.. అదుపు తప్పి.. రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా.. ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వరుస ప్రమాదాలు..
కాగా, ఎమ్మెల్యే లాస్య నందితకు వరుసగా ప్రమాదాలు జరిగాయి. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించిన బీఆర్ ఎస్ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో హోంగార్డ్ మృతి చెందాడు. అయినప్పటికీ.. ఎమ్మెల్యే ఆ డ్రైవర్ నే కొనసాగించారు. దీనికి ముందు.. లిఫ్టులో ఇరుక్కపోయిన ఆమె.. మూడు గంటలకు పైగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. తాజా ప్రమాదంలో మృతి చెందారు.
సాయన్న కుమార్తెగా..
దివంగత ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నేత సాయన్న కుమార్తెగా లాస్య నందిత అందరికీ తెలిసిందే. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి..
ఎమ్మెల్యే లాస్య నందిత హఠాన్మరణం పట్ల.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తీరని లోటని పేర్కొన్నారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ కూడా ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే కవిత స్పందిస్తూ.. బీఆర్ ఎస్ యువ నేత మృత్యువాత పడడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.