కారుతో పొత్తు సరే.. తెలంగాణలో ప్రచారానికి అధినేత్రి వస్తారా?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ బీజేపీ అయితే సాయం చేసిందో అదే బీజేపీ ఇప్పడు రెండో స్థానానికి వచ్చి కారు పార్టీని వెనక్కునెట్టబోతోందనే కథనాలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 10 March 2024 10:51 AM GMTలోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో త్రిముఖ పోరు ఖాయం. వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ పరిస్థితి రావాల్సి ఉంది. కానీ, చివర్లో బీజేపీ చేతులెత్తేయడంతో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పోటీ మారింది. చివరకు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ గెలుపును తన్నుకుపోయింది. దాంతోపాటే ఈ మూడు నెలల పాలనలో మంచి మార్కులే సాధించింది. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టేబుల్ టాపర్ గా నిలిచే చాన్సుందనే అంచనా వస్తోంది. అయితే, మరి బీఆర్ఎస్ పరిస్థితి. మూడు నెలల కిందటి వరకు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఆ పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ బీజేపీ అయితే సాయం చేసిందో అదే బీజేపీ ఇప్పడు రెండో స్థానానికి వచ్చి కారు పార్టీని వెనక్కునెట్టబోతోందనే కథనాలు వస్తున్నాయి.
ఏనుగు ఎక్కి..
గత వారం తెలంగాణ రాజకీయాల్లో జరిగిన అనూహ్య పరిణామం.. బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అంటే మాయావతి సారథ్యంలో ఉత్తరాదిన గట్టి ఓటు బ్యాంకు ఉన్న పార్టీ. అలాంటి పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ తో కలవడం సంచలనం రేపింది. బీఆర్ఎస్ మీద ఉన్న ప్రధాన విమర్శ.. దొరల పార్టీ అని. అంటే.. బడుగు-బహుజన వర్గాల గళం వినిపించే బీఎస్పీకి పూర్తి భిన్న పంథా. సరే.. రాజకీయంగా ఈ విమర్శలు/ఆరోపణలు ఎలా ఉన్నా, ఈ రెండు పార్టీ కలయిక ఆశ్చర్యకరమే. తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో పోటీకి దిగి ప్రభావం చూపలేకపోయింది బీఎస్పీ. స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పరాజయం పాలయ్యారు. ఇక బీఆర్ఎస్ హ్యాట్రిక్ హ్యాట్రిక్ అంటూ పరుగెత్తి ఓటమి మూటగట్టుకుంది. లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపకుంటే ఆ రెండు పార్టీలకు కష్టమే. ఈ పరిస్థితులే వారిని పొత్తుకు పురికొల్పాయని చెప్పక తప్పదు.
మరి మాయావతి వస్తారా?
తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రచారానికి రాలేదు. మరి లోక్ సభ ఎన్నికలకైనా ప్రచారం చేస్తారా? అందులోనూ బీఆర్ఎస్ తో పొత్తు కలిసిన నేపథ్యంలో కేసీఆర్ తో కలిసి వేదిక పంచుకుంటారా? అనేది ఆసక్తికర ప్రశ్న. వాస్తవానికి మాయావతి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పెద్ద ఆశాదీపం. ఆమె కదిలితే లక్షల మంది ఆలోచిస్తారు. కానీ, యూపీ ఎన్నికల్లోనూ మాయావతి ప్రభావం చూపలేకపోతున్నారు. అతి పెద్ద రాష్ట్రంలో 2007లో సొంతంగా అధికారంలోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత క్రమంగా తెరమరుగయ్యారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోనూ ప్రభావం చూపిన బీఎస్పీ ఇప్పుడు ప్రధాన పోటీదారు రేసులో లేదు. రెండేళ్ల కిందటి యూపీ ఎన్నికల్లోనూ మాయావతి చురుగ్గా వ్యవహరించలేదు. మరిప్పుడు తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వస్తారా? లేదా? అనేది చూడాలి. కేసీఆర్ తో కనకు మాయావతి వేదిక పంచుకుని.. బీజేపీపై, మోదీపై నేరుగా విమర్శలు చేస్తే అది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం ఖాయం.