మొన్న పొత్తు.. నిన్న సీట్లు.. నేడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు రిజైన్
అందుకు బీఎస్పీని వీడడం తప్ప మరో అవకాశం లేకుండాపోయిందని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 16 March 2024 10:58 AM GMTతెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మనో వేగంగా మారిపోతున్నాయి. ఈపార్టీ నుంచి ఆ పార్టీకి.. ఆ పార్టీ నుంచి ఈపార్టీకి జంపింగ్ లు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక ఇవి ఇంకెంతగా మారుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. లోక్ సభ ఎన్నికలు అయ్యాక కూడా జంపిగ్ లు కొనసాగే పరిస్థితి ఉందని తెలుస్తోంది. అయితే, వీటి మధ్యనే మరో ఆసక్తికర పరిణామం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని అందులో పేర్కొన్నారు. అందుకు బీఎస్పీని వీడడం తప్ప మరో అవకాశం లేకుండాపోయిందని పేర్కొన్నారు.
అటు పొత్తు పొడవగానే..
సరిగ్గా వారం పదిరోజుల కిందట బీఆర్ఎస్-బీఎస్పీ మధ్యన లోక్ సభ ఎన్నికలకు పొత్తు కుదిరింది. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. కొందరు ఈ పొత్తును స్వాగతించారు కూడా. ఇక శుక్రవారం బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్ సభ సీట్లను కేటాయించింది బీఆర్ఎస్. అయితే, ఈలోగానే ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయడం గమనార్హం. మరోవైపు బీఎస్పీకి రాజీనామా చేసిన తరువాత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఏదో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
ట్వీట్ లో ఏముందంటే..?
‘ఇరు పార్టీల పొత్తు (బీఆర్ఎస్-బీఎస్పీ)లో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకుసాగాలని నమ్మాను. అది నేను నమ్మిన ధర్మం. మా పొత్తు బయటకు వెల్లడైన వెంటనే బీజేపీ దానిని భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు (ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను. చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా’’ అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ లో రాసుకొచ్చారు. తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక బీఎస్పీదే అన్నారు.