పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అరెస్టు... కారణం ఇదేనా?
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు
By: Tupaki Desk | 15 Nov 2023 4:41 AM GMTవైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసులతో దురుసుప్రవర్తన, క్రికెట్ బెట్టింగ్, పోలీస్ పై దాడి మొదలైన ఆరోపణలు ఈయనపై ఉన్నాయని తెలుస్తుంది. రవిపై వల్లూరు పోలీసుస్టేషన్ లో ఓ కేసు పెండింగ్ లో ఉంది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు!
అవును... టీడీపీ నేత బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడప పర్యటన నేపధ్యంలో డ్యూటీలో ఉన్న ఓ పోలీసుపై దురుసుగా ప్రవర్తించి, అతని కాలు ఫ్యాక్చర్ అవ్వడానికి బీటెక్ రవి కారకుడంటూ అప్పట్లో కేసు నమోదయింది! ఈ నేపథ్యంలో రవిని అరెస్టు చేసిన పోలీసులు... రిమ్స్ లో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కడప ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు ఎదుట హాజరు పర్చారు. దీంతో అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఈ విషయాలపై స్పందించిన డీఎస్పీ షరీప్ అరెస్ట్ కారణాలను వెల్లడించారు. ఇందులో భాగంగా... కడప విమానాశ్రయం దగ్గర ఆందోళన చేసినందుకు బీటెక్ రవిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నాడు జరిగిన తోపులాటలో ఒక పోలీస్ కు గాయాలయ్యాయి. దానిపైన విచారణ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని అన్నారు. గత 10 నెలలుగా రవి అందుబాటులో లేరని తెలిపారు!
ఇదే సమయంలో ఈ మధ్యే పోరుమామిళ్ల కేంద్రంగా భారీ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం చోటు చేసుకున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయటంతో.. తీగలాగితే డొంక మొత్తం కదిలిందని, ఈ మొత్తం వ్యవహారం బీటెక్ రవి కనుసన్నళ్లోనే జరిగిందని.. ఆ సమయంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. స్థానికంగా లాడ్జిలను స్వయంగా తనిఖీలు చేశారని అంటున్నారు! ఈ అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అరెస్ట్ కు ఇదే కారణం!:
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ కు స్వాగతం పలకడానికి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప విమానాశ్రయంకు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయనకు వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.
కడపలో కిడ్నాప్ కలకలం:
పోలీసులు బీటెక్ రవిని అదుపులోకి తీసుకోగానే టీడీపీ ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి.. బీటెక్ రవిని కిడ్నాప్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారని తెలుస్తుంది! దీంతో మీడియాలో "కడపలో కిడ్నాప్ కలకలం" అంటూ బ్రేకింగ్ న్యూ స్ లు టెలీకాస్ట్ అయ్యాయి. అయితే ఆఖరికి రవిని పోలీసులు అరెస్టును ధ్రువీకరించటంతో ఈ గాసిప్ లకు తెరపడింది.