కొంప 'కొల్లేరు'.. మరోసారి ఉగ్రరూపం!
ఇప్పుడు తాజాగా బుడమేరు తీసుకొస్తున్న వరద కొల్లేరు పరివాహక ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. వరద ఈ స్థాయిలో పెరుగుతుంటే మరోవైపు వర్షం కూడా తగ్గడం లేదు.
By: Tupaki Desk | 8 Sep 2024 7:48 AM GMTగత వారం కురిసిన వర్షాలకు ఏపీ ప్రజలు వణికిపోయారు. ఇంకా ఆ బాధల నుంచి ప్రజలు కోలుకోనే లేదు. ఆ వరదలను మరిచిపోకముందే ప్రకృతి మరోసారి వారిని భయపెడుతోంది. వరద నీరు పెరుగుతుండడంతో ఆందోళనలో పడ్డారు.
గత వర్షాలకు కొల్లేరులోకి భారీగా వరద నీరు చేరడంతో సమీప గ్రామాలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాంతో ప్రజలంతా చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. తాజాగా.. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు నుంచి కొల్లేరులోకి భారీగా వచ్చి చేరింది. ఆ ప్రభావంతో కొవ్వాలంక, పెనుమాకులంక, నందిగామ లంక, మణుగూరు గ్రామాలు నీట మునిగాయి. దాంతో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొల్లేరు ఉధృతి పెరగడంతో దెందులూరు, ఏలూరు రూరల్, ఉంగుటూరు, ఉండి, కైకలూరు నియోజకవర్గం పరివాహక ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
పెదపాడు మండలం వసంతవాడ జడ్పీ హైస్కూల్‌లో ఇక్కడి ప్రజలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రంలో 60 కుటుంబాలు తలదాచుకుంటున్నాయి. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొల్లేరు ఉధృతితో రాకపోకలు సైతం నిలిచిపోయాయి. కైకలూరు నుంచి ఏలూరు వెళ్లే మార్గాన్ని క్లోజ్ చేసినట్లు స్థానిక సీఐ తెలిపారు. అవసరమైతే గానీ ప్రజలు బయటకు రావద్దని సూచించారు.
గత వర్షాలకు బుడమేరు ఎంత బీభత్సం సృష్టించిందో చూశాం. ఇప్పుడు తాజాగా బుడమేరు తీసుకొస్తున్న వరద కొల్లేరు పరివాహక ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. వరద ఈ స్థాయిలో పెరుగుతుంటే మరోవైపు వర్షం కూడా తగ్గడం లేదు. ఇటు వరద, అటు వర్షాలు లంక ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా కొల్లేరు ఉగ్రరూపం దాల్చడంతో పెదపాడు మండలం కడిమికుంట పరిసర గ్రామాల పరిధిలోని పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే ఇళ్లు సైతం వరదతో నిండిపోవడంతో వారంతా పునరావాస కేంద్రాలకు తరలారు. అయితే.. తాము వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకుంటున్నా, ఇంటి వద్ద ఉన్న పశువుల పరిస్థితి ఏంటని వారు ఆవేదన చెందుతున్నారు.